Kuchipudi Dancer KIlled in US: అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ అమర్‌నాథ్ ఘోషన్‌ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మిసౌరిలో ఈ హత్య జరిగింది. ఈవినింగ్ వాక్‌కి వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి ఆయనపై దాడి చేసి గన్‌తో షూట్ చేశారు. అక్కడికక్కడే కుప్పు కూలి ప్రాణాలొదిలారు అమర్‌నాథ్ ఘోష్. సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో డ్యాన్స్‌లో మాస్టర్స్ చేస్తున్నారు. చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ ఈ ఘటనపై స్పందించింది. ఎప్పటికప్పుడు విచారణకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నామని స్పష్టం చేసింది. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించింది.
"మిసౌరిలో కూచిపూడి డ్యాన్సర్ అమర్‌నాథ్ ఘోష్ ఇలా హత్యకు గురి కావడం బాధాకరం. వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ టీమ్ కూడా విచారణ చేపడుతోంది. వాళ్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నాం"
- ఇండియన్ ఎంబసీ
టీవీ యాక్టర్ దేవొలీనా భట్టఛటర్జీ (Devoleena Bhattacharjee) X వేదికగా పోస్ట్ పెట్టడం వల్ల అమర్‌నాథ్ ఘోష్ హత్య విషయం అందరికీ తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ సాయం కోరుతూ పోస్ట్ పెట్టారు. తన స్నేహితుడు అమర్‌నాథ్‌ని దారుణంగా కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
"నా స్నేహితుడు అమర్‌నాథ్ ఘోష్ దారుణంగా హత్యకు గురయ్యాడు. మూడేళ్ల క్రితమే అతని తల్లి చనిపోయింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. ఇప్పుడు అమర్ కూడా చనిపోయాడు. ఇప్పుడతని కుటుంబంలో ఎవరూ మిగలకుండా పోయారు. ఇప్పటి వరకూ ఎవరు చంపారన్న వివరాలు ఏమీ తెలియలేదు. కోల్‌కత్తాకి చెందిన అమర్‌నాథ్ చాలా గొప్ప డ్యాన్సర్. ప్రస్తుతం డ్యాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఈవినింగ్ వాక్ చేస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు"
- భట్టఛటర్జీ, టీవీ నటి
ఉత్తరప్రదేశ్‌కి చెందిన సిక్కుని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అమెరికాలోని కీర్తన్ గ్రూప్‌లో పని చేస్తున్న మ్యుజీషియన్ రాజ్ సింగ్ అలియాస్ గోల్డీపై అలబామాలోని గురుద్వారా వద్ద కాల్పులు జరిపారు. ఫిబ్రవరి 23న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. దాదాపు ఏడాదిన్నరగా అమెరికాలోనే ఉంటున్న రాజ్‌సింగ్ గురుద్వారాలో కీర్తనలు పాడేందుకు వెళ్లాడు. ఈ కార్యక్రమం ముగిసిన తరవాత గురుద్వారా నుంచి బయటకు వచ్చాడు. రోడ్డుపై నిలబడి ఉన్న సమయంలో కొంతమంది ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపారు. కుటుంబాన్ని పోషిస్తున్న రాజ్‌సింగ్ మృతిపై బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని తండ్రి ఐదేళ్ల క్రితమే చనిపోయాడు. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రాజ్‌సింగ్ కూడా చనిపోవడం కుటుంబ సభ్యుల్ని కలిచి వేసింది. వీలైనంత త్వరగా అతని మృతదేహాన్ని భారత్‌కి రప్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు.