Lok Sabha Polls 2029: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అనుకున్న స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయినా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై ఇండీ కూటమి నేతలు ఇప్పటికీ సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ఏదో గెలిచారంటే గెలిచారంతే అని ఎద్దేవా చేస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ ఈ సారి 99 స్థానాల్లో విజయం సాధించి గట్టిగా పుంజుకుంది. అయితే... ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రహోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2029 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. అప్పుడు కూడా గెలిచేది మేమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఏం చేసినా సరే మళ్లీ గెలిచేది తామేనని స్పష్టం చేశారు. నాలుగోసారి కూడా నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌పైనా సెటైర్లు వేశారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ కన్నా బీజేపీయే ఎక్కువ సీట్లు సాధించిందన్న విషయాన్ని ఆ పార్టీ మర్చిపోయిందని చురకలు అంటించారు. ప్రస్తుత NDA ప్రభుత్వం ఎక్కువ రోజుల పాటు నిలవదని ప్రచారం చేస్తున్నారని, కానీ ఇప్పుడే కాదు..వచ్చేసారి కూడా తమ ప్రభుత్వమే ఉంటుందని వెల్లడించారు అమిత్ షా. (Also Read: Viral News: అంత రాత్రి పూట రోడ్డు మీద ఏం చేస్తున్నావ్, లైంగిక వేధింపుల బాధితురాలితో పోలీసుల దురుసు ప్రవర్తన)


"ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చేసుకోనివ్వండి. కానీ నేను ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ NDA మళ్లీ అధికారంలోకి వస్తుంది. మరోసారి మోదీయే ప్రధాని అవుతారు. గత మూడు ఎన్నికల ఫలితాలను గమనిస్తే కాంగ్రెస్ కన్నా బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈ విషయం కాంగ్రెస్‌ గుర్తిస్తే మంచిది"


- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి






వచ్చే ఎన్నికల్లోనూ ప్రతిపక్షంగా ఉండేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు అమిత్ షా. అంతే కాదు. ప్రతిపక్షం అంటే ఎలా పని చేయాలో తెలుసుకుని అప్పటికైనా కాస్త పద్ధతి మార్చుకోవాలని విమర్శించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. 2019లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి ఇండీ కూటమి పుంజుకోవడం వల్ల బీజేపీకి భారీగా సీట్లు తగ్గిపోయాయి. అయితే..టీడీపీ, జేడీయూ సహకారంతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 


Also Read: Kerala: వయనాడ్ విలయంపై శశి థరూర్ పోస్ట్‌, క్షణాల్లోనే కాంట్రవర్సీ - క్లారిటీ ఇచ్చినా ఆగని ట్రోలింగ్