KTR Tweet On CM Revanth America Tour: తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి భారీ బృందం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుకు నా విషెష్. ఆల్ ది బెస్ట్' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వ బృందం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 'గత పదేళ్లలో ఉత్తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక మల్టీ నేషనల్ కంపెనీలు ప్రపంచ దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురాగలిగాం. విదేశాల్లోని ప్రముఖ కంపెనీలతో ఏర్పరుచుకున్న సంబంధాలు ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేకూరుస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించేందుకు మేం ప్రాధాన్యత ఇచ్చాం. మా విధానాలతో ఇవాళ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావడం సంతోషకరం.' అని అన్నారు.






తెలంగాణలోని అద్భుత వాణిజ్య విధానాలు, టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల ప్రక్రియ వంటి వాటి వల్ల ఇప్పటికే తాము తీసుకువచ్చిన కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలో కూడా రాష్ట్రానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. గడిచిన దశాబ్ద కాలంలో రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకురావడంతో సహా ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు సృష్టించామన్నారు. రాజకీయాలు పక్కన పెడితే తనకు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఫస్ట్ అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ప్రతినిధి బృందం ఇలాంటి కంపెనీలతో మరోసారి చర్చలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆకాంక్షించారు. ప్రస్తుత ప్రభుత్వం తాము దశాబ్ద కాలంగా నిర్మించిన బలమైన పెట్టుబడుల పునాదులపైన మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


సీఎం రేవంత్ బృందానికి ఘన స్వాగతం


అటు, పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా అమెరికాకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆయన అభిమానులు సీఎంను ప్రసంసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. న్యూయార్క్‌లో ఆయన ఎన్ఆర్ఐలతో సమావేశమవుతారు. 10 రోజుల పాటు ఆయన బృందం అగ్రరాజ్యంలో పర్యటిస్తూ వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. అమెరికా పర్యటన అనంతరం దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటించనున్నారు.


Also Read: Sridhar Babu: త్వరలోనే హైదరాబాద్ బెంగళూరును దాటేయబోతోంది - శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు