Amit Shah On Rahul Gandhi:


విలువైన సమయం వృథా చేశారు: అమిత్‌ షా 


కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాహుల్ గాంధీపై విరుచుకు పడ్డారు. పార్లమెంట్ విలువైన సమయాన్ని వృథా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. యూపీలో కౌశంబి మహోత్సవ్‌ను ప్రారంభించిన అమిత్‌షా ఆ తరవాత బహిరంగ సభలో ప్రసంగించారు. 2024 ఎన్నికల్లోనూ దేశ ప్రజలు మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధానిగా ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. 


"రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసినందుకు విపక్షాలు ఆందోళన చేశాయి. పార్లమెంట్ విలువైన సమయాన్ని వృథా  చేశాయి. ప్రజలు ఆ పార్టీలను ఎప్పటికీ క్షమించరు"


- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 






కాంగ్రెస్ నేతలు పదేపదే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చేసిన వ్యాఖ్యలపైనా అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల కుటుంబం ప్రమాదంలో ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ విమర్శించారు. 


"ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు. వాళ్ల కుటుంబం, కులవాదం, వారసత్వ రాజకీయాలు ప్రమాదంలో ఉన్నాయి. వాళ్ల నిరంకుశత్వం ప్రమాదంలో ఉంది. ప్రజలు ఇలాంటి వాళ్లను కోరుకోవడం లేదు. ప్రధాని మోదీ ఇలాంటి కుల రాజకీయాలను చిత్తుగా ఓడించారు. అందుకే..ఎస్‌పీ, బీఎస్‌పీ లాంటి పార్టీలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. అందుకే విపక్షాలు ఇంతగా భయపడుతున్నాయి"


- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 






పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి చర్చలు జరగకుండా ముగిసిపోవడంపైనా అసహనం వ్యక్తం చేశారు అమిత్‌షా. దేశ చరిత్రలో ఇదే మొదటి సారి అంటూ మండి పడ్డారు. 


"పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోయాయి. మన దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎలాంటి చర్చలు జరగకుండానే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సభ సజావుగా సాగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసినందుకు ఇదంతా చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ఆయనపై అనర్హతా వేటు వేశారు. అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాపాడేందుకు మన్మోహన్ సింగ్‌ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రయత్నించారు. కానీ రాహుల్ దాన్ని వ్యతిరేకించారు. సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఇప్పటి వరకూ 17 మంది సభ్యులకు ఇలానే జరిగింది. రాహుల్‌ అందుకు అతీతమేమీ కాదు. దీనికోసం కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి సభ సజావుగా సాగకుండా నిరసనలు చేపట్టారు"


- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 


Also Read: Coronavirus Spike: హాట్‌స్పాట్‌లు గుర్తించండి, టెస్టింగ్‌ సంఖ్య పెంచండి - రాష్ట్రాలకు కేంద్రం సూచన