Actor Vishal: తమిళ స్టార్ హీరోల్లో నటుడు విశాల్ ఒకరు. ఆయనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన అన్ని సినిమాలు దాదాపు తెలుగులో కూడా విడుదల అవుతాయి. కేవలం నటుడు గానే కాకుండా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన తన నిర్మాణ సంస్థకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తుండటంతో ఈ విషయం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు విశాల్ కు బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టులో 15 కోట్లు డిపాజిట్ చేయకపోతే ఆయన నిర్మించిన సినిమాలను విడుదల చేయడానికి వీల్లేదు అంటూ తీర్పునిచ్చింది మద్రాస్ హైకోర్టు. దీంతో విశాల్ సినిమా కెరీర్ రిస్క్ లో పడినట్లైంది.
అసలేం జరిగిందంటే..
హీరో విశాల్ 2016లో ‘మరుదు’ సినిమా చేశారు. ఈ సినిమా కోసం విశాల్ గోపురం అనే ఫిల్మ్ నిర్మాణ సంస్థకు చెందిన అన్బు చెజియన్ నుంచి 15 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఆ రుణాన్ని విశాల్ తిరిగి చెల్లించలేదు. ఆ మొత్తం వడ్డీతో కలిపి 2019 నాటికి 21.29 కోట్లకు పెరిగింది. అయితే ఈ మొత్తాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు విశాల్, లైకా సంస్థ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే విశాల్ అప్పు తిరిగి చెల్లించే వరకూ విశాల్ ఫిల్మ్ సంస్థకు సంబంధించిన అన్ని హక్కులను లైకా సంస్థకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విశాల్ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేదని, కాబట్టి వారెంటీని ఉల్లంఘించి ‘వీరమే వాగై చూడుం’ సినిమాను లైకాకు ఇవ్వకపోవడంతో లైకా సంస్థ అప్పట్లో కోర్టులో కేసు వేసింది.
గత ఏడాది మార్చిలో ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ రామమూర్తి.. 3 వారాల్లోగా రూ.15 కోట్లు కోర్టు చీఫ్ రిజిస్ట్రార్ పేరిట జాతీయ బ్యాంకులో శాశ్వత డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై ఇటీవలే నటుడు విశాల్ చెన్నై హైకోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజా, జస్టిస్ డి.భరత చక్రవర్తి గత తీర్పును సమర్థిస్తూ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 15 కోట్ల రూపాయలను చీఫ్ రిజిస్ట్రార్ పేరు మీద శాశ్వత డిపాజిట్ చెల్లించే వరకు నటుడు విశాల్ ఫిల్మ్ కంపెనీ నిర్మించే లేదా ఆర్థిక సహాయం చేసే కొత్త చిత్రాల విడుదలపై చెన్నై హైకోర్టు మధ్యంతర నిషేధం విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో విశాల్ కు హైకోర్టు లో చుక్కెదురైంది. ఇక విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. గతేడాది ‘లాఠీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విశాల్. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రీసెంట్ గా ఆయనకు బిగ్ హిట్ ను అందించిన ‘డిటెక్టివ్’ సినిమాకు సీక్వెల్ లో నటించనున్నారు విశాల్.
Also Read : మీటర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం ఊర మాస్ ‘మీటర్’ ఎలా ఉంది? రీడింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?