‘RRR’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లు వసూళ్లతో రికార్డులు బ్రేక్ చేసింది. ఇక ఈ చిత్రంలో నటించేందుకు ఎన్టీఆర్ రూ.45 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఆయన తాజాగా బాలీవుడ్ లో ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాకు గాను ఆయన ఓ రేంజిలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.


‘వార్ 2’లో విలన్ పాత్రకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?


‘RRR’ సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్ వరుసబెట్టి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియన్ సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘వార్2’లో నటించేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరో కాగా, ఎన్టీఆర్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు.   


రూ. 100 కోట్ల క్లబ్ లో చేరబోతున్న జూ. ఎన్టీఆర్


ఇక ఈ సినిమాలో నటించేందుకు గాను ఎన్టీఆర్ కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాస్త అటు ఇటుగా రూ.100 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎంత అనే విషయాన్ని ప్రకటించకపోయినా, ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంటే జూ. ఎన్టీఆర్ రేంజి మరోలా ఉండబోతుందంటున్నారు సినీ ప్రముఖులు. ‘RRR’ దూకుడు ఇక ముందుకు కూడా కొనసాగించనున్నట్లు అభిప్రాయపడుతున్నారు.  


తాజాగా ‘వార్ 2’ గురించి యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటన చేసింది.  స్పై యూనివర్స్ చిత్రంలోకి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తుండగా, నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెమ్యునరేషన్ పై చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు రూ.100 కోట్లు వసూలు చేస్తున్నారు.  ప్రభాస్, తలపతి విజయ్, అక్షయ్ కుమార్ లాంటి నటులు ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్లకు పైగా ఫీజు వసూలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ‘వార్ 2’తో  ఆ క్లబ్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.   


వరుసగా 6 హిట్లు అందుకున్న జూ. ఎన్టీఆర్


నిజానికి గత కొంత కాలంగా జూ. ఎన్టీఆర్ సినిమా పరిశ్రమలో మంచి సక్సెస్ లు అందుకుంటున్నారు. 2015లో వచ్చిన ‘టెంపర్’ సినిమా తర్వాత హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన, వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’,  ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’,  ‘అరవింద సమేత’,  ‘RRR’  సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. ప్రస్తుత టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఏ హీరోకు కూడా వరుసగా అర డజన్ హిట్లు అందిన సందర్భాలు లేవు.


Read Also: గలీజ్ కంటెంట్ ఆగాల్సిందే, ఓటీటీకి సెన్సార్‌షిప్‌పై సల్మాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు