China Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి మరోసారి తన కోరలు చాచుతూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రకటన చేసింది.
నిబంధనలు
వైరస్ వ్యాపించకుండా రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. కోమోర్బిడిటిస్‌తో బాధపడే పెద్దవాళ్ళ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రికాషన్ డోసులు తీసుకోవాలని తెలిపింది. విదేశీ ప్రయాణాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడారు.
మళ్లీ కేసులు
అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని నివేదికలు వస్తున్న నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై అధికారులు, నిపుణులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ బుధవారం సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి ఆగిపోలేదని తెలుపుతూ సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారి చేసారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ ఈ మంగళవారం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్ చేస్తూ లేఖలు రాశారు. 2019 లో ప్రారంభమై దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించి, వారి జీవితాలను అతలాకుతలం చేసింది కరోనా. వైరస్ సంక్షోభం ధాటికి అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు పతనమయ్యాయి. ప్రపంచ దేశాల ప్రజలు వరుస లాక్ డౌన్‌లు, కొవిడ్ నిబంధనల మూలంగా ఇళ్లకే పరిమితమై అనేక ఆర్ధిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇన్ని అవస్థలకు గురి చేసిన కరోనా వైరస్ మళ్ళీ తన ప్రతాపం చూపిస్తోంది.
Also Read: China Coronavirus Cases: ఈ వీడియో చూస్తే.. మీ మూతికి మాస్క్ వస్తుంది, చేయి శానిటైజర్ పట్టుకుంటుంది!