Ambedkar Smriti Vanams :   బెజవాడ బందర్ రోడ్డులోని స్వరాజ్ మైదానంలో 81 అడుగుల పెడస్టల్ పై 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుతో మొత్తం 206 అడుగుల ఎత్తున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం తయారయింది. కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించారు. విగ్రహ భాగాలను విడివిడిగా విజయవాడకు తరలించి స్మృతి వనంలో క్రమ పద్ధతిలో అతికించి అద్భుతంగా తీర్చిదిద్దారు.  


బెజవాడ అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలు 


అంబేద్కర్ విగ్రహం బేస్‌లో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లు ఉండగా.. ఒక్కొక్కటి 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాలు. మిగిలిన మూడు హాళ్లలో అంబేద్కర్ చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. మొదటి అంతస్తులో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్ళు ఉంటాయి. ఒక హాల్ లో అంబేద్కర్ కు దక్షిణ భారత్‌తో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసేలా ఫొటోలతో డిస్‌ప్లే చేస్తారు. సెకండ్‌ ఫ్లోర్‌లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లు ఉంటాయి. అంబేద్కర్‌ స్మృతివనంలో విగ్రహం ఉన్న ప్రాంతానికి ఒక వైపు నుంచి వెళ్లి.. మరో వైపు నుంచి తిరిగి వచ్చేలా విశాలమైన హాలు మాదిరిగా నిర్మాణాలు చేపట్టారు. వాటి గోడలకు అంబేద్కర్‌ జీవిత విశేషాలు, ఆయన చరిత్రకు సంబంధించిన ఘట్టాల శిల్పాలను అద్దారు. లోపలి భాగంలోని హాళ్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంబేద్కర్‌ పాల్గొన్న సమావేశాలు, సభలకు సంబంధించిన పాత చిత్రాలను భారీ చిత్రాలుగా డిజిటలైజ్‌ చేసి డిస్‌ప్లే చేశారు. అంబేద్కర్‌ రాసిన కీలకమైన లేఖలు, ఉపన్యాసాలను ఆయా ఘట్టాలకు అనుగుణంగా ఫొటోలతో పాటు డిస్‌ప్లే చేశారు.


డిజి­టల్‌ బోర్డులపై డిస్‌ప్లే


అంబేద్కర్‌ ఆశయాలు, ఆదర్శాలు, సందేశాలను సైతం క్లుప్తంగా తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో డిజి­టల్‌ బోర్డులపై డిస్‌ప్లే చేశారు. ‘చదువు.. సమీకరించు.. బోధించు’ వంటి ప్రధానమైన సందేశాలను ప్రముఖంగా ఏర్పాటు చేశారు. స్మృతివనం ఆవరణను పచ్చని తివాచీ పరిచినట్టు గరిక, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్‌ విగ్రహానికి ముందు ఏర్పాటు చేసిన నెమళ్ల ప్రతిరూపాలు విశేషంగా ఆకట్టుకునేలా రూపొందించారు. మ్యూజిక్‌కు అనుగుణంగా ఎగసిపడే వాటర్‌ ఫౌం­టెయిన్‌లు అదనపు ఆకర్షణగా ఉన్నాయి. ఫెడస్టల్‌ చుట్టూ ఉన్న ప్రాంతంలో వాటర్‌ కొలను మాదిరిగా ఫౌంటేయిన్‌ను ఏర్పాటు చేశారు. రూ.  170 కోట్ అంచనాలతో ప్రారంభమైన ప్రాజెక్టు  .. పూర్తయ్యేసరికి 404 కోట్ల రూపాయలకు చేరింది.


సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడిచేందుకు వీలుగా చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటాలకు వేదికైన స్వరాజ్య మైదానాన్ని ఇకపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా పిలుస్తారు. స్మృతి వనంలో డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ ఎక్ప్‌పీరియన్స్ సెంటర్, 2వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాటర్‌బాడీస్, మ్యూజికల్ ఫౌంటెయిన్, లాంగ్ వాక్‌ వేస్‌తో డిజైన్ అసోసియేట్స్ తీర్చిదిద్దింది. విగ్రహాన్ని స్టీల్ ఫ్రేమింగ్‌తోపాటు కాంస్యంతో తయారు చేసిన క్లాడింగ్‌తో రూపొందించారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా దేశంలోనే తయారు చేశారు. విగ్రహం తయారీ కోసం 400 మెట్రిక్‌ టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు. కాలచక్ర మహా మండపం లోపల విగ్రహం కింద అంబేద్కర్‌ జీవిత విశేషాలు తెలిపే కేంద్రం ఏర్పాటు చేశారు. మ్యూజియం కోసం ప్రదర్శనలు సిద్ధం చేశారు. అంబేద్కర్ జీవిత కథతో లోతుగా కనెక్ట్ అవ్వడానికి, స్ఫూర్తిని పొందగలిగేలా తీర్చిదిద్దారు.


ఒకేసారి 2 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు 


భవనం బేస్‌మెంట్‌తో పాటు జి+1తో నిర్మించారు. 6వేల 340 చదరపు మీటర్ల ప్లింత్ ఏరియాలో ఒకేసారి 2 వేల మంది సభ్యులు కూర్చునేలా రూపొందించారు. స్మృతి వనంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. రెండు వైపులా వాహనాల పార్కింగ్‌కు వీలు కల్పించారు. ఒకేసారి 95 ఫోర్‌ వీలర్స్‌, 84 టూ వీలర్స్‌ పార్క్‌ చేసుకోవచ్చు. అంబేద్కర్‌ విగ్రహ ప్రాజెక్ట్‌ సైట్‌లో ఐదారు వందల మంది కార్మికులు నిరంతరం పనిచేశారు. 55 మంది టెక్నికల్, సపోర్టింగ్ ఉద్యోగులు రేయింబవళ్లు రెండేళ్ల పాటు పనిచేశారు.
 



తెలంగాణ స్మృతి వనంలో ప్రత్యేకతలు ఇవీ 



హైదరాబాద్ నగరం నడిబొడ్డున.. సాగర తీరాన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం  ఎత్తు   125 అడుగులు.  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి కూతవేటు దూరంలో, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కనే 11.34 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఏర్పాటు చేశారు. విగ్రహంతో పాటు, గార్డెన్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.146.50 కోట్లు ఖర్చు పెట్టారు.  నోయిడా డిజైన్ అసోసియేట్స్‌కు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ప్రముఖ శిల్పి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వన్‌జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ ఈ విగ్రహాల నమూనాలను తయారు చేశారు. ఈ విగ్రహాన్ని మొదట ఉక్కుతో నిర్మించి.. దానిపై ఇత్తడి తొడుగులను భిగించారు. ఇత్తడి విగ్రహం పూర్తిగా ఢిల్లీలో పోత పోశారు. ఈ విగ్రహం 30 ఏళ్ల పాటు మెరుస్తూనే ఉంటుంది. దానిపై పాలీయురేతీన్ కోటింగ్ కొట్టడమే కారణం. 30 ఏళ్ల తర్వాత మరోసారి కోటింగ్ వేస్తే మెరుపు అలాగే ఉంటుంది.


అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు.. అయితే ఆ విగ్రహాన్ని 50 అడుగుల పీఠంపై ఏర్పాటు చేశారు. అంటే ఈ భారీ విగ్రహం 175 అడుగుల ఎత్తులో.. ఆకాశాన్ని అంటేలా కనపడుతూ ఉంది.   బాబా సాహెబ్ అంబేద్కర్ గురించిన విశేషాలతో స్మృతి భవనాన్ని నిర్మించారు. ఇందులో మ్యూజియం, లైబ్రరీ, ఆడియో, వీడియో విజువల్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ నిర్మించారు. అంబేద్కర్ జీవితంలోని కీలకమైన, మరుపురాని ఘట్టాలకు సంబంధించిన వీడియోలను నిత్యం ప్రసారం చేస్తారు. ఇక్కడ అంబేద్కర్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీ కూడా ఉన్నది.అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పీఠం వరకు సందర్శకులు వెళ్లే వీలుంది.


అంబేద్కర్ స్మృతి వనాన్ని 2.93 ఎకరాల్లో తీర్చి దిద్దారు.  దీనికి సంబంధించిన పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. పచ్చదనంతో పాటు రాక్ గార్డెన్స్‌, ఫౌంటెయిన్, ఫ్లవర్ గార్డెన్, టికెట్ కౌంటర్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్ ఉన్నాయి. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం విగ్రహం పట్టుకొని ఉండగా.. కింద భారత పార్లమెంట్ భవనాన్ని పోలిన కట్టడం సందర్శకులను ఆకట్టుకునేలా ఉంటుంది. 


మొత్తంగా ఏపీ తెలంగాణ అంబేద్కర్ స్మృతి వనాల కాన్సెప్ట్ సేమ్  టు సేమ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు.