Amazon Lay Offs: 


గేమింగ్ విభాగంలో..


అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్‌లు మొదలయ్యాయి. ఈ సారి గేమింగ్ డివిజన్‌లో 100 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది సంస్థ. ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, అమెజాన్ సాన్ డిగో స్టూడియోలోని ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. కంటెంట్‌పై ఎక్కువ దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని కంపెనీ వెల్లడించింది. 


"ప్రస్తుత ప్రాజెక్ట్‌లన్నింటినీ ఎవాల్యుయేట్ చేశాం. ఆ తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడు విభాగాల్లోని 100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నాం. మిగతా ప్రాజెక్ట్‌ల కోసం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులనే నియమించుకుంటున్నాం. ఇంటర్నల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటేనే కొత్త ప్రాజెక్ట్‌లు వస్తాయి" 


- అమెజాన్ 


విడతల వారీగా లేఆఫ్‌లు..


HRలతో మీటింగ్ జరిగిన సమయంలో ఆయా ఉద్యోగులకు "లేఆఫ్‌"ల గురించి చెప్పినట్టు అమెజాన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే...ఉద్యోగాలు కోల్పోయిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌తో పాటు మరి కొన్ని ప్రయోజనాలు అందించనున్నట్టు స్పష్టం చేసింది కంపెనీ. ఇప్పటికే విడతల వారీగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది అమెజాన్. ఈ ప్రక్రియ మరి కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


జీతాల్లోనూ కోత..


అమెజాన్ కంపెనీ షేర్లు దీర్ఘకాలంగా తిరోగమనంలో ఉండడం కారణంగా సంస్థ కార్పొరేట్ ఉద్యోగులు వేతన తగ్గింపును ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాకు చెందిన బ్లూమ్‌బెర్గ్ సంస్థ రిపోర్ట్ ప్రకారం.. అమెజాన్ ఉద్యోగులను కంపెనీలో ఎక్కువ కాలం కొనసాగించేందుకు వీలుగా, ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లను (RSUలు) జారీ చేయనుంది. స్టాక్స్ విలువ కంపెనీ అనేది సంస్థకు చెందిన కొన్ని విభాగాల పనితీరుపైన ఆధారపడి ఉండనుంది. ఆర్ఎస్‌యూలు కేటాయించడం వల్ల ఉన్నత స్థాయి ఉద్యోగులు తాము కూడా సంస్థలో భాగస్వామ్యం అనే ఉద్దేశంతో మరింత సమర్థంగా పని చేయడానికి వీలుకలుగుతుంది. 2022లో పేలవమైన స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా Amazon షేర్లు 35 శాతానికి పైగా క్షీణించాయి. దీని ఫలితంగా 2023లో ఉద్యోగులకు అమెజాన్ ఇచ్చిన అంచనా లక్ష్యాల కంటే 15 శాతం నుంచి 50 శాతం మధ్య జీతం తక్కువగా ఉంటుందని బ్లూమ్‌బర్గ్ నివేదిక అంచనా వేసింది. ‘‘2017, 2022 ప్రారంభంలో, స్టాక్ ధర ప్రతి సంవత్సరం సగటున సుమారు 30 శాతం పెరిగింది. కానీ అమెజాన్ యొక్క స్టాక్ ప్రస్తుతం ఒక్కో షేరుకు $ 96 (దాదాపు రూ. 7,950) ట్రేడ్ అవుతోంది. కానీ, కొంత మంది ఉన్నత ఉద్యోగుల వేతన ప్యాకేజీలు మాత్రం.. ఒక్కో షేరుకు దాదాపు $ 170 (దాదాపు రూ. 14,000) ఉండవచ్చనే అంచనాలపై రూపొందించారు. ఈ కారణంగానే 50 శాతం వరకూ కోత విధించే అవకాశం ఉంది.’’ అని నివేదికలో వెల్లడించారు. కొంత మంది ఉద్యోగులు ఈ లేఆఫ్‌లు, జీతాల కోతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వారినీ తొలగిస్తున్నారంటూ మండి పడుతున్నారు. 


Also Read: Supreme Court: ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు, దర్యాప్తు సంస్థలపై వేసిన పిటిషన్ నిరాకరణ