Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా ... రీటైల్‌ గా మాత్రం ప్రజలకు ఫలితం దక్కడం లేదు. రేట్లను ఆయిల్ కంపెనీలు తగ్గించడం లేదు.

Continues below advertisement


Why Petro Rates No Change :  దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రోజూ మారతాయి. దీని కోసం ఓ విధానం ఉంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగితే ఇక్కడా పెంచుతారు. అందుకే -లాక్‌డౌన్ సమయంలో 80 రూపాయిలు ఉండే పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 110కి చేరింది.  మరి అలాంటప్పుడు క్రూడాయిల్ ధరలు తగ్గితే తగ్గాలి కదా !. కానీ తగ్గడం లేదు. మార్చితో పోలిస్తే క్రూడాయిల్ ధరలు 20 శాతానికిపైగా పడిపోయాయి. కానీ పెట్రో ధర మాత్రం పైసా కూడా తగ్గలేదు. కేంద్రం అలాంటి ఆలోచన  చేయడం లేదు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు పెంచుతూ.. తగ్గినప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉంటోంది కేంద్రం. 

Continues below advertisement

అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు 

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గుతున్నాయి.  తాజాగా పదినెలల కనిష్టానికి చేరాయి.   ఈ ఏడాది మార్చిలో బ్యారెల్‌  క్రూడాయిల్ ధర 112.87 డాలర్లుగా గా ఉంది. ఇప్పుడు అంటే డిసెంబర్‌కు వచ్చే సరికి ఆ ధర  88 డాలర్ల దరిదాపుల్లో ఉంది.  జులైలో బ్యారెల్‌ ధర 105.49 డాలర్లగా ఉండగా, ఆగస్టులో రూ. 97.40కి,. సెప్టెంబర్‌లో రూ. 90.71కి తగ్గింది. అక్టోబర్‌లో స్వల్పంగా పెరిగి 91.70కి స్వల్పంగా పెరిగినప్పటికీ నవంబర్‌లో 88.66 డాలర్లకు పడిపోయింది. ఇది ఈ ఏడాది జనవరి నెలలో ఉన్న ధరలతో దాదాపు సమానం. పెరిగినప్పుడు ప్రతీ రోజా పావలా.. చొప్పున పెంచిన ఆయిల్ కంపెనీలు ఇప్పుడు ఏమీ తెలియనట్లే ఉంటున్నాయి. 

ప్రజలకు బదిలీ కానీ ధరల తగ్గుదల ప్రయోజనం ! 

క్రూడాయిల్ ధరలు పతనం అయినప్పటికీ సామాన్య ప్రజలకు పది రూపాయల ప్రయోజనం కూడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడటం లేదు. 'మరికొంత కాలం ధరలు ఇలానే ఉంటాయి...' అనే సంకేతాలు పంపుతున్నారు.  పెట్రోల్‌, డీజిల్‌ రిటల్‌ ధరలో సగం కన్న ఎక్కువ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే.  ఎక్సైజ్‌ సుంకం ద్వారానే కేంద్ర ఖజానాకు లక్షల కోట్లు సమకూరుతున్నాయి. సెస్‌లు దానికి అదనం. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో, రిటైల్‌ మార్కెట్‌లోనూ తగ్గాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో మరి కొంత కాలం రిటైల్‌ షాపుల వద్ద భారీ ధరలు కొనసాగనున్నాయి. ఆలోగా అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి. అందులో ఎలాంటి  మోహమాటాలు పెట్టుకోరు అధికారులు. 

పెట్రో పన్నులతో ప్రభుత్వాలకు పంట !

మన దేశంలో పెట్రో ధరలపై 60శాతానికి పైగా పన్నుపోటు కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం పేరుతో రూ.32.90 మేర బాదుతుండగా.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 36 శాతం దాకా వ్యాట్‌ను విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే వ్యాట్‌కు అధనంగా లీటరుపై రూ.2-రూ.4 దాకా అదనంగా వసూలు చేస్తున్నాయి.

పెట్రో కంపెనీలు నష్టాలను భర్తీ చేసుకుంటున్నాయన్న వాదన 
 
ప్రస్తుతం పడిపోతున్న క్రూడాయిల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కంపెనీలు పొందిన నష్టాలను కవర్ చేసుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  క్రూడాయిల్ ధరలు పెరిగి, రూపాయి పతనమవుతోన్న సమయంలో.. పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచి కంపెనీలు నష్టాలను భరించాయని.. లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.12 నుంచి రూ.15 మేర నష్టాన్ని పొందాయంటున్నారు.   కారణంతో ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా తగ్గుతోన్న ధరలకు అనుగుణంగా..వాటిని భర్తీ చేసుకుంటున్నాయని అంటున్నారు.  రూపాయి పడిపోతుండటంతో.. ధరల విషయంలో కంపెనీలు కాస్త వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి.  దేశంలో ద్రవ్యోల్బణం ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ఆ పరిస్థితి నుంచి కేంద్రాన్ని గట్టెక్కించేందుకు చమురు సంస్థలు ధరలను తగ్గించడం లేదనే వాదనలూ ఉన్నాయి.

Continues below advertisement
Sponsored Links by Taboola