Pahalgam Terror Attack: : జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో 26 మంది సామాన్య ప్రజలు మరణించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ హింసాత్మక చర్యను ఖండించారు. అలాగే గాయపడిన వారందరికీ ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని ప్రకటించారు. కంపెనీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఆయన తన ప్రకటనను పంచుకున్నారు.
దుఃఖ సమయంలో బాధితులకు సహాయం
సోషల్ మీడియాలో ఇలా రాశారు, ''పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రవాద దాడిలో అమాయకులైన భారతీయుల మృతిపై రిలయన్స్ కుటుంబ సభ్యులందరూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. గాయపడిన వారందరికీ ముంబైలోని మా రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందనుంది.''
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పోరాటానికి ముకేష్ అంబానీ తన మద్దతును తెలియజేస్తూ, ''ఉగ్రవాదం మానవత్వానికి శత్రువు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో మన ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం మొత్తం దేశంతో మేము సహాయంగా ఉంటాం.'' అని అన్నారు.
పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారతదేశం చేపట్టిన చర్యలు
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం అనేక దౌత్యపరమైన, పరిపాలనాపరమైన చర్యలు చేపట్టింది, అవి సింధు జల ఒప్పందాన్ని వెంటనే నిలిపివేయడం, అటారి-వాఘా సరిహద్దును మూసివేయడం, పాకిస్తాన్ పౌరులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని రద్దు చేయడం, అన్ని పాకిస్తాన్ పౌరులు ఏప్రిల్ 27 నాటికి దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించడం. భారతదేశం చేపట్టిన ఈ చర్యల తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి దేశమంతా కలవరపాటుకు గురి చేసింది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు దీన్ని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
వాఘా బోర్డర్ జామ్
పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం 48 గంటల సమయం ఇచ్చిన తర్వాత, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ ద్వారా పాకిస్తాన్ పౌరులు దేశానికి వెళ్లిపోతున్నారు. పాకిస్తాన్‌లో వివాహం చేసుకున్న కొంతమంది మహిళలు (భారత పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నారు) అవసరమైన పత్రాలు ఉన్నప్పటికీ తిరిగి రావడంలో సమస్యలను ఎదుర్కొంటున్నామని అన్నారు. తమ బంధువులను కలుసుకోవడానికి భారతదేశానికి వచ్చామని, పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లడానికి ప్రభుత్వం 48 గంటల గడువు విధించిన తర్వాత, సరిహద్దు దాటలేక ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు.