ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరయ్యే కొద్ది రాజకీయ పార్టీల మధ్య విమర్శల వేడి పెరుగుతోంది. ముఖ్యంగా సమాజ్‌వాదీ, భాజపా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఫైర్ అయ్యారు. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో మత విద్వేషాలు రేపాలని అఖిలేశ్ యాదవ్ మరోసారి ప్రయత్నిస్తున్నారని యోగి ఆరోపించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాఫియా లీడర్లు, నేర చరితులకే సమాజ్‌వాదీ పార్టీ టికెట్లు ఇచ్చిందని యోగి విమర్శించారు. 2012-2017 వరకు అధికారంలో ఉన్నప్పుడు మాఫియాకు మద్దతు పలికిన సమాజ్‌వాదీ పార్టీ మరోసారి అలాంటి పరిస్థితులు తీసుకురాలనుకుంటుందని యోగి అన్నారు.
ఈసీకి ఫిర్యాదు..
మరోవైపు భాజపాపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అఖిలేశ్ యాదవ్ అన్నారు. మాజీ ఐపీఎస్ అసిమ్ అరుణ్‌తో పాటు భాజపాలో ఇటీవల చేరిన అధికారులు అందరినీ ఉద్యోగం నుంచి తొలగించాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఈసీపై అనుమానాలు వ్యక్తమవుతాయన్నారు.