Akhilesh Yadav on Bharat Jodo Yatra:
మా ఐడియాలజీ వేరు: అఖిలేష్
భారత్ జోడో యాత్రపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఐడియాలజీతో పోల్చుకుంటే...తమ పార్టీ (సమాజ్‌వాదీ) ఐడియాలజీ పూర్తిగా వేరు అని వెల్లడించారు. "మాకెలాంటి ఆహ్వానం అందలేదు. బీజేపీ, కాంగ్రెస్ ఐడియాలజీ ఒకటే. మా ఆలోచనా విధానం పూర్తిగా వేరు" అని అన్నారు. అయితే...భారత్ జోడో యాత్రకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అఖిలేష్ యాదవ్ ఇలా స్పందించడానికి ఓ కారణముంది. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని బీఎస్‌పీ అధినేత్రి మాయావతికి కాంగ్రెస్ ఇన్విటేషన్ పంపించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే అఖిలేష్ ఇలా కామెంట్ చేశారు. యూపీలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన ఎస్‌పీకి ఇప్పటి వరకూ ఆహ్వానం అందకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. "భారత్ జోడో యాత్రకు మా మద్దతు ఉంటుంది. అలా అని మేము ఏకమై కూటమి కడతామన్న పుకార్లు పుట్టడం మాకు ఇష్టం లేదు" అని సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి ఘనశ్యామ్ తివారీ వెల్లడించారు. గతంలో కాంగ్రెస్, ఎస్‌పీ జత కట్టాయి. 2008లో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కలిసి పోటీ చేశాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేరు పడ్డాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు యూపీలో మిగిలింది రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏదో విధంగా గట్టిగా నిలబడాలని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ వర్సెస్ సీఆర్‌పీఎఫ్..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ చేసిన భద్రతా లోపాల ఆరోపణలను CRPF తోసిపుచ్చింది.
" రాహుల్ గాంధీకి నిర్దేశించిన భద్రతా మార్గదర్శకాలను ఆయన ఉల్లంఘించినట్లు అనేక సందర్భాల్లో గమనించాం. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్లాం. "
- సీఆర్‌పీఎఫ్ ప్రకటన
దిల్లీలో 'భారత్ జోడో యాత్ర' సందర్భంగా "భద్రతా ఉల్లంఘనలు" జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీ సహా యాత్రలో పాల్గొనే వారికి తగిన భద్రతను కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ రాసింది. డిసెంబర్ 24న దిల్లీలో అడుగుపెట్టిన జోడో యాత్రకు పోలీసులు ఎలాంటి రక్షణ కల్పించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీ సహా యాత్రికుల భద్రతపై దిల్లీ పోలీసులు నిర్లక్ష్యం వహించారని, ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ లేఖకు ప్రతిస్పందనగా సీఆర్‌పీఎఫ్ వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 2020 నుంచి ఇప్పటివరకు 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని సీఆర్‌పీఎఫ్ వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆయనకు తెలియజేశారని పేర్కొంది.