కాలుష్యం కారణంగా తగ్గుతున్న ఆయుష్షు
పెద్ద వాళ్లు చిన్న వాళ్లను ఆశీర్వదించేప్పుడు నిండు నూరేళ్లు వర్ధిల్లు అంటారు. నిజంగా వందేళ్లు బతికే వాళ్లు మాత్రం చాలా తక్కువే. మన ముందు తరాల వాళ్లలో అలాంటి వాళ్లున్నారేమో కానీ మనమైతే అన్ని రోజులు బతకటం కష్టమే. మన లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు అలాంటివి మరి. అందుకే క్రమక్రమంగా మన జీవన కాలం తగ్గుతూ వచ్చింది. ఇదే సమస్య అనుకుంటే మన ఆయుష్షు మరో ఐదేళ్ల పాటు తగ్గనుందని చెబుతోంది ఓ రిపోర్ట్. అమెరికాలోని చికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ తేల్చి చెప్పిన విషయమిది. ఇంతకీ మన ఆయుష్షు తగ్గిపోవటానికి కారణమేంటో తెలుసా..? వాయుకాలుష్యం. అవును. కేవలం కాలుష్యం కారణంగానే భారతీయుల ఆయుష్షు తగ్గుతోందని నివేదిక తేల్చి చెప్పింది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటూ ఎన్నో నివేదికలు ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించాయి. ఇప్పుడు ఈ నివేదిక కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా దిల్లీ
కాలుష్య కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ప్రమాణాలు పాటించాలని సూచించింది. అయితే ఈ విషయంలో భారత్ వెనకబడుతోంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరాల్లో భారత్‌లోనూ నగరాలూ ఉంటున్నాయి. ఇప్పుడు చికాగో యూనివర్సిటీ విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో దేశ రాజధాని దిల్లీ తొలి స్థానంలో ఉంది. దిల్లీలోని గాలిలో అత్యంత కాలుష్య కారకాలైన సూక్ష్మ ధూళి కణాలు అధికంగా ఉన్నాయని తేల్చి చెప్పింది ఈ నివేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకంటే దాదాపు 21రెట్లు అధికంగా వాయు కాలుష్యం నమోదవుతోందని వెల్లడించింది. ఇదే స్థాయిలో కాలుష్యం కొనసాగితే దిల్లీ వాసుల ఆయుష్షు దాదాపు పదేళ్లు తగ్గిపోతుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, హరియాణా, త్రిపుర కూడా అత్యంత కలుషిత రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే బంగ్లాదేశ్ తరవాత అధికంగా కలుషితమైన దేశం భారత్. భారతీయులందరూ ప్రమాదకర కాలుష్య వాతావరణంలోనే జీవిస్తున్నారని తేల్చి చెప్పింది చికాగో యూనివర్సిటీ నివేదిక. ఉత్తర భారతంలోనే దాదాపు 51 కోట్ల మంది కాలుష్య ముప్పు ఎదుర్కొంటున్నారు. 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా కొత్త పరిశ్రమలు వేలల్లో పుట్టుకు రావటం వల్లే కాలుష్యం పెరిగిందని అంచనా వేశారు. ధూమపానం, మద్య పానం కన్నా వాయు కాలుష్యం వల్లే ఎక్కువ మంది ప్రభావితమవుతున్నారని, ప్రమాణాలు పాటించకపోతే జీవన కాలం మరింత తగ్గే ప్రమాదముందని హెచ్చరించారు పరిశోధకులు. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు.