Air India Suspension:
ఎయిర్ ఇండియా సర్వీస్‌లు రద్దు..
ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో Air India టెల్ అవీవ్‌కి రాకపోకలపై ఆంక్షలు విధించింది. అక్కడికి ఫ్లైట్ సర్వీస్‌లను నిలిపివేసింది. యుద్ధం మొదలైన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు వారం రోజులు దాటినా ఇంకా ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఆంక్షల్ని కొనసాగిస్తూ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 18 వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. సాధారణంగా ఎయిర్ షెడ్యూల్ ప్రకారం...వారానికి ఐదు ఫ్లైట్‌లు టెల్ అవీవ్‌కి ( Tel Aviv) వెళ్తాయి. సోమ, మంగళ,గురు,శని, ఆది వారాల్లో ఈ సర్వీస్‌లు నడుస్తాయి. అంతకు ముందు అక్టోబర్ 14 వరకూ సర్వీస్‌లను నిలిపేసింది. ఇప్పుడు మరో నాలుగు రోజులు ఎక్స్‌టెండ్ చేసింది. అయితే...ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా ఇండియాకి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా సహకరిస్తోంది. కొన్ని ఛార్టెడ్ ఫ్లైట్స్‌ని ఇజ్రాయేల్‌కి పంపుతున్నారు. ఆపరేషన్ అజయ్ (Operation Ajay)లో భాగంగా ఇజ్రాయేల్ నుంచి భారతీయుల్ని సేఫ్‌గా ఇండియాకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండు ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
మిగతా ఎయిర్ లైన్స్ కూడా..
ఎయిర్ ఇండియాతో పాటు మరి కొన్ని సంస్థలూ సర్వీస్‌లను సస్పెండ్ చేశాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా, లుఫ్తాన్సా, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్, రియాన్ ఎయిర్, ఏజియన్ ఎయిర్‌లైన్స్‌పైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. టెల్ అవీవ్ ఎయిర్‌పోర్ట్‌లోనూ యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఇండియన్ టూర్ ఆపరేటర్స్‌కీ సమస్యలు తప్పడం లేదు. చివరి నిముషంలో చాలా మంది టూరిస్ట్‌లు ప్లాన్ మార్చేసుకున్నారు. టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇంకొందరు రీషెడ్యూల్ చేస్తున్నారు. ఈ డిసెంబర్‌లో అక్కడ విజిట్ చేయాలని ప్లాన్ చేసుకున్న వాళ్లంతా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. జోర్డాన్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వాళ్లూ షెడ్యూల్ మార్చుకున్నారు. నిజానికి డిసెంబర్‌లో ఇజ్రాయేల్, జోర్డాన్, ఈజిప్ట్‌కి టూరిస్ట్‌లు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. అక్కడి టూరిజంకి ఇది మంచి సీజన్ కూడా. 2019 అక్టోబర్- డిసెంబర్ లెక్కల ప్రకారం..ఇండియా, ఇజ్రాయేల్‌కి మధ్య 38 వేల 573 మంది రాకపోకలు సాగించారు. అటు యూరప్‌లోనూ టూరిస్ట్‌లు ప్లాన్‌లూ తలకిందులైపోయాయి.
ఇజ్రాయెల్ నుంచి భారతీయల తరలింపు కొనసాగుతోంది. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 235 మంది భారతీయులతో రెండవ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. ఉగ్రవాద సంస్థ హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన రెస్క్యూ మిషన్ ‘ఆపరేషన్ అజయ్’. భారతీయుల తరలింపుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రస్తుతానికి చార్టర్ విమానాలను ఉపయోగిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అవసరమైతే వైమానిక దళాన్ని కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
Also Read: హమాస్ దాడులకు ఒక రోజు ముందే అమెరికా వార్నింగ్, ఇంటిలిజెన్స్‌ని ఇజ్రాయేల్ లైట్ తీసుకుందా?