Air India:


బాధితురాలి కంప్లెయింట్..


ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ మహిళపై యూరినేట్ చేసిన వ్యక్తిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థ ఆ వ్యక్తిపై 30 రోజుల పాటు విమాన ప్రయాణం చేయకుండా ఆంక్షలు విధించింది. గతేడాది నవంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు నేరుగా టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కి ఫిర్యాదు చేశారు. కర్ణాటకకు చెందిన ఈ బాధితురాలి ఫిర్యాదుని పరిశీలించిన పోలీసులు నిందితుడిపై FIR నమోదు చేశారు. డిసెంబర్ 28న ఎయిర్ ఇండియా సంస్థ తమకు ఈ విషయం చెప్పిందని, ఆ తరవాత బాధితురాలని సంప్రదించి మరిన్ని వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితుడి పేరు శేఖర్ మిశ్రా అని తేలింది. ముంబయికి చెందిన ఈ బిజినెస్‌మేన్‌ ఎక్కడ ఉంటాడోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. "బాధితురాలి ఫిర్యాదు మేరకు పబ్లిక్‌ ప్లేస్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు ఐపీసీ సెక్షన్ 510, మహిళా గౌరవాన్ని భంగ పరిచినందుకు సెక్షన్ 509, అవమాన పరిచినందుకు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. అయితే...ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఉన్న సిబ్బందినీ విచారిస్తున్నారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం 50 ఏళ్ల శేఖర్ మిశ్రా...బిజినెస్‌క్లాస్‌లో ప్రయాణిస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్నాడు. టాయ్‌లెట్‌ కోసం అని లేచి ముందుకు వెళ్లాడు. అయితే...వాష్‌రూమ్ వరకూ వెళ్లాననుకుని ఆ మత్తులోనే ఓ మహిళపై యూరినేట్ చేశాడు. ఇది జరిగిన వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేశానని, కానీ వాళ్లు స్పందించలేదని ఆరోపిస్తున్నారు బాధితురాలు.


మూడేళ్ల జైలు శిక్ష..? 


"లంచ్ టైమ్ తరవాత ఫ్లైట్‌లో లైట్స్ ఆఫ్ చేశారు. అప్పుడే ఓ ప్యాసింజర్ నా సీట్‌ దగ్గరకు వచ్చాడు. నాపై యూరినేట్ చేయడం మొదలు పెట్టాడు" అని టాటా గ్రూప్ ఛైర్మన్‌కు రాసిన లేఖలో తెలిపారు బాధితురాలు. ప్రస్తుతం నిందితుడిపై నమోదు చేసిన కేసుల పరంగా చూస్తే...దోషిగా తేలితే కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎయిర్‌ ఇండియా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..ఈ కేసు విచారణకు అంతర్గత కమిటీని ప్రత్యేకంగా నియమించారు. ఈ మధ్య కాలంలో విమానాల్లో ఇలాంటి ఘటనలు పెరిగి పోతున్నాయి. ప్రయాణికులు గొడవపడటం,  సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించడం లాంటివి తరచూ వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకాక్ నుంచి ఇండియాకు వచ్చే స్మైల్‌ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో ఇద్దరు ఇండియన్స్ ఘర్షణకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు గొడవకు కారణమేంటని ఆరాతీస్తే...ఓ సీట్ విషయంలోనే వాళ్లు అంతగా ఘర్షణ పడ్డారని తేలింది.