Air India Express Flights Cancelled: Air India Express కంపెనీకి ఎక్కడిలేని చిక్కొచ్చి పడింది. సిబ్బంది అంతా ఒకేసారి సిక్ లీవ్ పెట్టడం వల్ల విమానాలు నడపలేకపోతున్నామని వెల్లడించింది. 70 ఫ్లైట్స్‌ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు 300 మంది సీనియర్ ఉద్యోగులు ఒకేసారి సిక్‌లీవ్ పెట్టారు. అంతే కాదు. వాళ్లంతా మొబైల్స్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నట్టు తెలిపింది. ఏం చేయాలో తెలియక 79 ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఫ్లైట్స్ సర్వీస్‌లను రద్దు చేశామని వివరించింది. చివరి క్షణంలో సిక్‌లీవ్ అని చెప్పి అందరూ ఒకేసారి సెలవు పెట్టడంపై కంపెనీ షాక్ అయింది. వాళ్లందరినీ సంప్రదించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే..వాళ్లంతా ఇప్పటికే మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇటీవలే ఈ Tata Group ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ని కొనుగోలు చేసింది. మేనేజ్‌మెంట్ పూర్తిగా టాటా చేతుల్లోకి వెళ్లింది. దీనిపైనే ఉద్యోగులు కొందరు మండి పడుతున్నారు. కొత్త ఎంప్లాయ్‌మెంట్ టర్స్మ్ సరిగ్గా లేవని విమర్శిస్తున్నారు. టాటా గ్రూప్‌లో కలిపేసిన తరవాత సీనియర్ సిబ్బందిపై పక్షపాతం చూపిస్తున్నారని, కొత్తగా ఇంటర్వ్యూలు పెడుతున్నారని కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో పాస్ అయిన వాళ్లకి తక్కువ స్థాయి ఉద్యోగాలు ఇచ్చి అవమానిస్తున్నారన్న వాదన కూడా ఉంది.
"మా క్యాబిన్ క్రూలో కొంత మంది ఒకేసారి సిక్‌లీవ్ పెట్టారు. చివరి నిముషంలో ఈ విషయం చెప్పారు. రాత్రి నుంచి ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్లైట్స్‌ని రద్దు చేయాల్సి వచ్చింది. వాళ్లంతా ఒకేసారి ఎందుకు ఇలా సెలవు పెట్టారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. వాళ్ల సమస్యలేంటో తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఉన్నట్టుండి ఇలా ఫ్లైట్స్‌ని రద్దు చేయడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లందరికీ మా క్షమాపణలు"
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
ప్యాసింజర్స్ అందరికీ రీఫండ్ ఇస్తామని వెల్లడించింది ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్. మరో రోజు ఇదే ఫ్లైట్‌ని బుక్ చేసే ఆప్షన్‌ని కూడా ఇస్తామని స్పష్టం చేసింది. అయితే..చాలా మంది ప్రయాణికులు తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా రద్దు చేశారని మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read: AstraZeneca: ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉపసంహరణ, సంచలన ప్రకటన చేసిన ఆస్ట్రాజెన్‌కా