AstraZeneca Withdraws Covid Vaccine: కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెన్‌కా కంపెనీ (AstraZeneca) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇకపై ఈ వ్యాక్సిన్‌లను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయన్న చర్చ జరుగుతున్న సమయంలోనే ఇలా కీలక ప్రకటన చేసింది. యూకేకి చెందిన ఆస్ట్రాజెన్‌కా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కలిసి ఈ వ్యాక్సిన్‌ని తయారు చేశాయి. ఇదే టీకాను భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కొవిషీల్డ్‌ (Covishield) వ్యాక్సిన్‌గా అందరికీ అందించింది. ఇకపై ఈ వ్యాక్సిన్ తయారీ, సరఫరా ఉండవని స్పష్టం చేసింది ఆస్ట్రాజెన్‌కా సంస్థ. ఇప్పటికే కొవిడ్‌కి చాలా టీకాలు అందుబాటులోకి వచ్చాయని, అవే మిగిలిపోయాయని వివరించింది. వాణిజ్యపరమైన కారణాలు చూపించింది. కొత్త వ్యాక్సిన్‌లు వచ్చిన తరవాత కొవిషీల్డ్‌ని అవి రీప్లేస్ చేశాయని, అందుకే ఇకపై ఉత్పత్తి ఆపేయాలని నిర్ణయించుకుంటున్నామని తేల్చి చెప్పింది. యురేపియన్ యూనియన్‌లోనూ మార్కెటింగ్ ఆథరైజేషన్‌ని స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది. ఇకపై ఎక్కడా ఈ వ్యాక్సిన్ వినియోగంలో ఉండదని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న అన్ని దేశాల్లోనూ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. 


యూకేలో ఈ వ్యాక్సిన్‌పై పెద్ద వివాదమే నడుస్తోంది. చాలా మంది బాధితులు కంపెనీపై కేసు వేశారు. ఈ టీకా తీసుకున్న వాళ్లలో కొందరు చనిపోయారని, మరి కొందరకి రకరకాల సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. దీనిపై యూకే కోర్టులో విచారణ జరగ్గా ఆస్ట్రాజెన్‌కా కంపెనీ సైడ్‌ఎఫెక్ట్స్ ఉన్న మాట నిజమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరిలో Thrombocytopenia Syndrome వచ్చే అవకాశమూ ఉందన్న మాటనీ అంగీకరించింది. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుందని...అంత ఆందోళన చెందాల్సిన పని లేదని వివరించింది. 


"వ్యాక్సిన్ తయారు చేసిన మొదటి సంవత్సరం 65 లక్షల మంది ప్రాణాల్ని కాపాడం. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల డోస్‌లు అందించాం. అన్ని దేశాల ప్రభుత్వాలు మా సేవల్ని గుర్తించాయి. అలాంటి కష్టకాలంలో సాయం అందించినందుకు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నాయి. అయితే..మా తరవాత మరెన్నో సంస్థలు కొవిడ్ టీకాను తయారు చేశాయి. అవన్నీ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. కరోనా ప్రభావం తగ్గిపోవడం వల్ల అవన్నీ మిగిలిపోయాయి. అందుకే..ఇకపై ఈ కొవిడ్ వ్యాక్సిన్‌ తయారీని ఆపేయాలని నిర్ణయించుకున్నాం"


- ఆస్ట్రాజెన్‌కా