Ahmedabad Schools Gets Bomb Threat: ఇటీవలే దేశరాజధాని ఢిల్లీలో పలు స్కూల్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్ రావడం సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే అటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొన్ని స్కూల్స్‌కీ ఇవే బెదిరింపులు వచ్చాయి. 7 స్కూల్స్‌కి ఇలా ఈమెయిల్స్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మెయిల్స్ చూసిన వెంటనే యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించాయి. హుటాహుటిన పోలీసు బృందాలతో పాటు బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. ఆనంద్ నికేతన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహా మరి కొన్ని స్కూల్స్‌కీ ఈ మెయిల్స్ వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరక్కపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా కొందరు దుండగులు పదేపదే స్కూల్స్‌కి మెయిల్స్ పంపించి బెదిరిస్తుండడాన్ని ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. IP అడ్రెస్‌ల ఆధారంగా ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఢిల్లీలో అలజడి..
గత వారమే ఢిల్లీలో దాదాపు 80 స్కూల్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఒక్కసారిగా పోలీసులు అన్ని చోట్లకూ పరుగులు పెట్టారు. బాంబ్ స్క్వాడ్స్ కూడా చాలా వేగంగా స్పందించి తనిఖీలు చేపట్టింది. అప్పటికప్పుడు విద్యార్థులందరినీ ఇళ్లకు పంపించేశాయి యాజమాన్యాలు. కొందరు కావాలనే ప్రజల్ని భయపెట్టేందుకు ఇలాంటివి చేస్తున్నారని, కచ్చితంగా వాళ్లని గుర్తిస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే...విదేశాల నుంచి కొందరు ఇలా మెయిల్స్ పంపిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ మేరకు భారత్ రష్యాకి సమాచారం అందించింది. విచారణకు సహకరించాలని కోరింది. ఇదంతా జరుగుతుండగానే అహ్మదాబాద్‌లో మళ్లీ ఇవే బెదిరింపులు రావడం అలజడి రేపుతోంది.
రష్యానుంచి బెదిరింపులు..?
ఢిల్లీలో స్కూల్స్‌కి బెదిరింపులు వచ్చిన సమయంలోనే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కోవాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రష్యన్ డొమైన్ నుంచి ఈ మెయిల్స్ అన్నీ వస్తున్నాయని గుర్తించారు. అయితే..కచ్చితంగా అక్కడి నుంచే ఈ మెయిల్స్ వచ్చాయనుకోడానికి వీల్లేదని, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వివరిస్తున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళనకు గురి కాకూడదని, ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకడం లేదని వెల్లడించారు పోలీసులు. కొందరు కావాలనే ఇలా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అసహనం స్పష్టం చేశారు. గతంలోనూ ఢిల్లీ సహా మరి కొన్ని చోట్ల ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. అయితే..ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ కావడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు.
Also Read: LS Elections 2024: ఎన్నికలకు ఏనుగుల ఆటంకం, తరమలేక తల పట్టుకుంటున్న అధికారులు