Ahmedabad News:


అహ్మదాబాద్‌లో పోస్టర్లు..


ఆప్‌, బీజేపీ మధ్య పోస్టర్ల పంచాయితీ ఇంకా చల్లారలేదు. ఇటీవలే ఢిల్లీలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆప్‌ పోస్టర్లు అంటించింది. వీటిపై ఢిల్లీ పోలీసులు ఫైర్ అయ్యారు. వెంటనే వాటిని తొలగించి అవి అంటించిన వారినీ అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. దీనిపై బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఇప్పుడు మరోసారి అహ్మదాబాద్‌లో ఇలాంటి పోస్టర్లే కనిపించాయి. "మోదీ హఠావ్, దేశ్ బచావ్" పోస్టర్లు అహ్మదాబాద్‌లో పలు చోట్ల అంటించారు. నిజానికి ఆమ్‌ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా అధికారికంగానే ఈ పోస్టర్ల క్యాంపెయిన్ మొదలు పెట్టింది. అందులో భాగంగానే...అహ్మదాబాద్‌లో ఈ పోస్టర్లు కనిపించాయి. అలెర్ట్ అయిన పోలీసులు...ఈ పోస్టర్లు అంటించిన 8 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. పలు చోట్ల అనుమతి లేకుండానే అభ్యంతరకర పోస్టర్లు అంటించారని వెల్లడించారు. దీనిపై గుజరాత్ ఆప్ చీఫ్ ఇసుదన్ గధ్వీ స్పందించారు. అరెస్టైన వాళ్లంతా ఆప్ కార్యకర్తలేనని వెల్లడించారు. బీజేపీ నియంతృత్వానికి ఇదో ఉదాహరణ అని, తమకు భయపడే ఆ పార్టీ ఇలా అరెస్ట్‌లు చేయిస్తోందని ఆరోపించారు. 


"బీజేపీ నియంతృత్వానికి ఇదో ఉదాహరణ. మోదీ హఠావో, దేశ్ బచావో అని పోస్టర్లు పెట్టారని చెబుతూ ఆప్ కార్యకర్తలపై ఇష్టమొచ్చిన కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మోదీ, బీజేపీ భయపడుతున్నారనటానికి ఇంత కన్నా సాక్ష్యం ఏముంటుంది? మీరేం చేస్తారో చేయండి. ఆప్ కార్యకర్తలు మాత్రం మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు"


- ఇసుదన్ గధ్వీ, గుజరాత్ ఆప్ చీఫ్ 






దేశవ్యాప్తంగా ఆప్ 11 భాషల్లో మోదీపై పోస్టర్ల వార్ ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తోంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ, తెలుగు, బెంగాలీ, ఒరియా, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో పోస్టర్లు ప్రింట్ చేయించింది. అరెస్ట్‌లపై ఆప్ అసహనం వ్యక్తం చేస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలోనూ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఎంతో మంది భారతీయులు పోస్టర్లు అంటించారని, అప్పుడు వారెవరినీ బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదని గుర్తు చేశారు. 


ఇటీవల ఢిల్లీలో పలు చోట్ల ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించడం సంచలనమైంది. పోలీసులు వెంటనే అప్రమత్తమై వాటిని తొలగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదంతా ఆప్ చేసిన పనే అని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ వివాదం నడుస్తుండగానే మరోసారి పోస్టర్ల కలకలం మొదలైంది. ఈసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. "అవినీతిపరుడు" అంటూ కేజ్రీవాల్‌ ఫోటోతో సహా ప్రింట్‌ చేసి పలు చోట్ల గోడలకు అంటించారు. "అరవింద్ కేజ్రీవాల్‌ను ఇంటికి పంపండి. ఢిల్లీని కాపాడండి" అని నినాదాలు కూడా  రాశారు. బీజేపీ నేత మనిజేందర్ సింగ్ ఈ పని చేయించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. తానూ ఈ పోస్టర్లను చూశానని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా అలాంటి పోస్టర్లు పెట్టుకునే హక్కు ఉందని చెప్పారు. 


"ఈ పోస్టర్లతో నాకొచ్చిన సమస్యేమీ లేదు. ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లను, పోస్టర్లు అంటించిన వారిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో నాకర్థం కావడం లేదు. ప్రధాని మోదీ భయపడుతున్నారనడానికి ఇదే నిదర్శనం. అలాంటి పోస్టర్లు అంటించినంత మాత్రాన జరిగే నష్టం ఏముంది..? ప్రధాని మోదీ ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోవడం సరికాదు"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 


Also Read: India-China Border: చైనా కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది, భారత్‌కే మా ఫుల్ సపోర్ట్‌ - అమెరికా