అహ్మద్ మసూద్.. ఈ పేరు వింటేనే తాలిబన్లు వణకుతారు. కాబూల్ ను రెండు గంటల్లో స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ఒక్కడికి భయపడటం ఏంటి? అనుకుంటున్నారా? కానీ మసూద్ కేవలం ఓ వ్యక్తి కాదు.. ఓటమనేదే ఎరుగని పంజ్ షీర్ లోయ కు రక్షకుడు. అతని భయంతోనే తాలిబన్లు ఇప్పటికీ పంజ్ షీర్ అంటేనే భయపడతారు.


ఎవరీ అహ్మద్ మసూద్..


అహ్మద్ మసూద్.. 1980, 90ల్లో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడిన అహ్మద్ షా మసూద్ కుమారుడు. 32 ఏళ్ల మసూద్ ప్రస్తుతం పంజ్ షీర్ లోయలో తాలిబన్ వ్యతిరేక దళాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన లండన్‌లో చదువుకున్నారు. రాయల్ మిలిటరీ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ తీసుకున్నారు.


మసూద్ తండ్రిని 'పంజ్‌షీర్ సింహం'గా పిలుస్తారు. ఆయన ముజాహిదీన్ కమాండర్. సోవియట్, తాలిబన్ బలగాలను ఆయన ఎదిరించారు. నిజానికి పంజ్‌షీర్ అంటే ఐదు సింహాలని అర్థం. అమెరికాలో 9/11 దాడులకు రెండు రోజుల ముందు అల్‌ఖైదా ఆయన్ను చంపేసింది. 


ఆ 'పంజ్‌షీర్ సింహం' కొడుకే మసూద్. తండ్రి బాటలో నడుస్తూ తాలిబన్లకు తలొగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే పంజ్‌షీర్ పై యుద్ధానికి ఎన్నో సార్లు తాలిబన్లు యత్నించినా తోకముడిచి పారిపోయారు. దానికి మసూద్ నాయకత్వమే ప్రధాన కారణం.


పంజ్‌షీర్ లోయ..


పంజ్‌షీర్ లోయ.. అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే కాబూల్ సహా దేశాన్నంతా చేతిలోకి తీసుకున్న తాలిబన్లకు ఇది మాత్రం కొరకరాని కొయ్యగా మారింది. ఇక్కడ కొన్ని వేల మంది తాలిబన్ వ్యతిరేక ఫైటర్లు ఉన్నారు.


1980లలో సోవియట్ బలగాలను, 1990లలో తాలిబాన్లను ఎదిరించి నిలిచింది పంజ్‌షీర్. సోవియట్, తాలిబాన్ల వ్యతిరేక ఫైటర్లకు ఇది కంచుకోట. ఈ లోయ ప్రస్తుతం నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ (ఎన్ఆర్ఎఫ్) చేతిలో ఉంది. దీనిని స్థాపించింది కూడా మసూదే.


మసూద్ వ్యూహమేంటి?


మసూద్ మాత్రం తాలిబన్లకు లొంగేదేలేదని తేల్చి చెబుతున్నారు. అఫ్గానిస్థాన్ ను కాపాడే శక్తి పంజ్‌షీర్ కు మాత్రమే ఉందంటున్నారు. అఫ్గాన్ ను గాలికి వదిలేసి వెళ్లిపోయిన అమెరికా సహా నాటో దళాలు తమకు ఆయుధ సంపత్తి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అది ఒక్కటి చేస్తే చాలు.. తాలిబన్ల పని తాము చూసుకుంటామని ధైర్యంగా చెబుతున్నారు. పంజ్‌షీర్ లో సహజంగా ఉన్న పర్వతాలే వారికి పెట్టని కోటలుగా మారాయి. తాలిబన్లు కనిపిస్తే కాదు.. ఆ మాట వినిపిస్తేనే అక్కడి సైన్యం రెచ్చిపోతుంది. అంతటి శక్తిమంతమైన కంచుకోటను దక్కించుకోవడం తాలిబన్లకు అంత తేలిక కాదు.


అయితే కనీసం చర్చల ద్వారానైనా మసూద్ ను ఒప్పిద్దామని తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. అయితే చర్చలకు మసూద్ ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. తాడోపేడో తేల్చుకోవడమేనని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరి తాలిబన్లు ఏం చేస్తారో చూడాలి. 


అఫ్గాన్ లో భారత్ ఎంత ఖర్చు చేసింది? ఇక్కడ స్పెషల్ వీడియో చూడండి..