Agneepath Scheme:



పిటిషన్‌లు తిరస్కరణ..


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పలువురు కోర్టుల్లో పిటిషన్‌లు కూడా వేశారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. ఢిల్లీ హైకోర్టులోనూ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా చాలా పిటిషన్‌లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ పక్కన పెట్టేస్తున్నట్టు వెల్లడించింది ఢిల్లీ హైకోర్టు. విచారణకు తిరస్కరించింది. ఇది మన భద్రతా బలగాలను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పథకం అని వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని తేల్చి చెప్పింది. పాత విధానం ప్రకారమే ఆర్మీ రిక్రూట్‌మెంట్ జరగాలని దాఖలైన పిటిషన్‌నూ తిరస్కరించింది. ఇది సరైన డిమాండ్ కాదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఇవన్నీ చివరకు సుప్రీం కోర్టుకు చేరుకున్నాయి. అయితే...సర్వోన్నత న్యాయస్థానం వాటిని ఢిల్లీ హైకోర్టుకి బదిలీ చేసింది. ఢిల్లీ హైకోర్టు చీఫ్‌జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. అయితే..ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌పై వివరణ ఇచ్చింది. రక్షణ రంగంలోని రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను గొప్ప సంస్కరణ అని చెబుతోంది. ఇకపై నియామకాల తీరు మారిపోతుందని తేల్చి చెప్పింది. నిజానికి గతేడాదే దీనిపై తీర్పునివ్వాల్సి ఉంది. కానీ...డిసెంబర్ 15న తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది ధర్మాసనం. గతేడాది జూన్ 14వ తేదీ నుంచి అగ్నిపథ్‌ అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం 17-21 ఏళ్ల మధ్య ఉన్న యువత దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు నాలుగేళ్ల పాటు ఆర్మీలో సేవలందించే అవకాశం కల్పిస్తారు.


విమర్శలు...వివరణలు..


 అగ్నిపథ్ పథకం కింద పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయస్సు గల యువకులు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేస్తారు. అయితే వారిలో 25 శాతం మంది తరువాత సాధారణ సేవ కోసం కొనసాగిస్తారు. ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచిందనట్లు జూన్ 16న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాలు, డిఫెన్స్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తామని ఉపశమన చర్యలు ప్రకటించింది కేంద్రం. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అగ్నిపథ్ పథకం కింద పనిచేసిన సైనికులను రాష్ట్ర పోలీసు బలగాలలో తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించాయి. కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు, అగ్నిప్రమాదాలకు పాల్పడిన వారిని చేర్చుకోబోమని సాయుధ దళాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ స్కీమ్‌ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని కొందరు విమర్శిస్తుంటే, విదేశాల్లో ఉన్నదేనని ఇంకొందరు సమర్థిస్తున్నారు. కేంద్రం ఎంత వివరణ ఇస్తున్నా, విమర్శలు మాత్రం ఆగటం లేదు. అటు ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయంపై భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇదే అంశమై కేంద్రంపై విమర్శలు గుప్పించారు. "నో ర్యాంక్, నో పెన్షన్" అన్నదే అగ్నిపథ్ పథకం ఉద్దేశమని ఎద్దేవా చేశారు. ఉద్యోగం సాధించినా వాళ్లకు ఆ ప్రయోజనాలు దక్కవని, అదే అగ్నిపథ్ పథకంలోని గొప్పదనం అంటూ సెటైర్లు వేశారు. 


Also Read: Manish Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్