Actor Suriya Political Plan: సినిమా టు పాలిటిక్స్. ఈ ట్రెండ్‌ కొత్తేమీ కాదు. ఎంతో మంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు సక్సెస్ అయ్యారు. ఇంకొందరు ఫెయిల్ అయ్యారు. ఫలితం ఎలా ఉన్నా సరే ఈ ట్రెండ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. తమిళనాడులో ఈ కల్చర్‌ కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమిళ నటుడు సూర్య కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు అందరి ఫోకస్ సూర్యవైపు మళ్లింది. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే సూర్య పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.


కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సూర్య ఇప్పటికే సోషల్ సర్వీస్‌తో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. Akaram పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. చాలా మంది Akaram Foundation ద్వారా ఉన్నత చదువులు చదువుకున్నారు. కొందరు ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మరి కొంత మంది ప్రైవేట్ సెక్టార్‌లోనూ మంచి పొజిషన్‌లో ఉన్నారు. 


పలు సంస్థలకూ పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటాడు సూర్య. ఇదంతా ఎప్పటి నుంచో చేస్తున్నప్పటికీ ఉన్నట్టుండి ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి. పైగా విజయ్‌ రాజకీయాల్లోకి రావడం వల్ల తరవాత వచ్చేది సూర్యనే అని కొందరు చాలా గట్టిగా వాదిస్తున్నారు. ఇక మరో పుకారు కూడా వినిపిస్తోంది. జిల్లాల వారీగా సూర్య తన ఫ్యాన్‌ క్లబ్‌లతో మాట్లాడారని, అక్కడి ప్రజలతో అధికారులతో టచ్‌లో ఉండమని చెప్పారనీ అంటున్నారు. ఎక్కువగా గ్రామీణ స్థాయిలోనే ఫోకస్‌ పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.


ఇదంతా చూస్తుంటే పంచాయత్ ఎన్నికల్లో సూర్య ఫ్యాన్‌ క్లబ్‌ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఈ ఎన్నికల్లో తన పేరు చెప్పుకుని ప్రచారం చేసుకోవడానికీ సూర్య ఓకే అన్నారనీ సమాచారం. ఆయన ఫొటో పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని ఫ్యాన్ క్లబ్‌లోని కొందరు కీలక వ్యక్తులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సూర్యకి వివరించారని తెలుస్తోంది. ముందు దీనికి ఒప్పుకోకపోయినా చివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే...రాజకీయాల పేరు చెప్పి అనవసరమైన రచ్చ చేయొద్దని సున్నితంగానే ఫ్యాన్‌ క్లబ్స్‌ని మందలించారనీ సమాచారం.