ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడ్డ భార్య భర్తను హత్య చేసింది. ఎవరికీ తెలియకుండా అనుమానాస్పద మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేసింది. లోతుగా విచారణ చేసిన పోలీసులకు అసలు గుట్టు తెలిసింది. 


ఆదిలాబాద్‌లో జాదవ్‌ గజానంద్‌ జైనాథ్‌ అనే ఉపాధ్యాయుడు రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితి హత్యకు గురయ్యారు. 40 ఏళ్లు ఉన్న ఆ వ్యక్తిని ఎవరు చంపి ఉంటారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులకు అతని భార్య చేసిన ఫోన్ కాల్స్ గుట్టు విప్పాయి. 


అనేక రకాలుగా విచారించిన పోలీసులు... చివరకు భార్యను కూడా విచారించారు. ఆమె కూడా ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఆమె కాల్‌ లిస్ట్‌ను కూడా ట్రాక్ చేశారు. దీంతో ఆమె కొన్ని రోజులుగా పదే పదే కాల్ చేసిన నెంబర్లు ద్వారా కేసును ఛేదించారు. 


జాదవ్‌ గజానంద్‌ జైనాథ్‌ భార్య విజయలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. తమ బంధానికి అడ్డు వస్తున్నారని భర్తను ఎలిమినేట్ చేయడానికి సిద్ధపడింది. మహేష్‌తో కూర్చొనిప్లాన్ చేసి సుపారీ గ్యాంగ్‌తో భర్త మర్డర్‌కు స్కెచ్ వేసింది. 


అనుకున్నట్టుగానే సుపారీ గ్యాంగ్‌తో విజయలక్ష్మి మాట్లాడారు. వారిని ఫోన్లో మాట్లాడుతూ భర్త వచ్చి వెళ్లే టైం,తిరిగే ప్రాంతాల గురించి ఇన్ఫర్మేషన్ అందించింది. ఒప్పందం చేసుకున్నట్టుగానే జాదవ్‌ గజానంద్‌ జైనాథ్‌ ను సుపారీ గ్యాంగ్ లేపేసింది. 


భర్త హత్య గురించి తెలుసుకొని బోరున విలపించినట్టు నటించింది. పోలీసులకి కూడా ఫిర్యాదు చేసింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు పోలీసులు ఆమె వద్దకు వచ్చి ఆగారు. ఆమె సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని చూస్తే మహేష్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, కాల్స్ చేసిన గుట్టు రట్టు అయింది. సుపారీ గ్యాంగ్‌తో డీల్ మాట్లాడిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.  ఉపాధ్యాయుడి మర్డర్ గుట్టు వీడటంతో మహేష్‌, విజయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. సుపారీ గ్యాంగ్ కోసం వేట కొనసాగిస్తున్నారు.