Polvaram And Anna Canteens: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో చేపట్టిన సోమవరం పోలవరంను పునరుద్ధరించారు. ఇకపై పోలవరం ప్రాజెక్టుపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా పోలవరంలో జరుగుతున్న జరిగిన పనులపై నేరుగా పరిశీలించిన తర్వాత ఇకపై వారం వారం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో మాట్లాడాలని నిర్ణయించారు. 


ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమావేసమయ్యారు. ఆయా శాఖల్లో జరుగుతున్న పనులు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందలో భాగంగా జలవనరుల శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. 


జలవనరుల శాఖాధికారులతో సమావేశమైన చంద్రబాబు... పోలవరం ప్రాజెక్టు పురోగతి, జరుగుతున్న పనులపై ఆరా తీశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో గత ప్రభుత్వం పనులను పూర్తిగా పక్కనే పడేసిందని... తాము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. ఇకపై పనుల వేగం పెరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 


అసలు ప్రస్తుతం ప్రాజెక్టు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఈ సోమవారం నేరుగా ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారులు చెప్పిన వివరాలపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేయలేదు. నేరుగా వెళ్లి చూస్తే తప్ప అర్థం కాదని అన్నారు. 


వంద రోజుల్లో అన్న క్యాంటీన్లు 
చంద్రబాబు తొలి రోజు సంతకం పెట్టిన ఫైల్స్‌లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఒకటి. ఆయా ప్రాంతాల్లో వంద రోజల్లో క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులకు సెప్టెంబర్‌ 21వరకు డెడ్‌లైన్ ఇచ్చారు. ఇందులో మున్సిపల్‌ కమిషనర్లతోపాటు, పబ్లిక్‌హెల్త్, అర్బన్ ప్లానింగ్ విభాగం అధికారులను కూడా భాగం చేశారు. గతంలో మాదిరిగానే భవనాల డిజైన్లు ఉండాలని గతంలో నిర్మించిన ఎంత వరకు ఉపయోగకరమో చూడాలన్నారు. ఇవాల్టి నుంచే చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.


మొదటి రోజు పాత భవనాలను పరిశీలించి అక్కడ పరిస్థితిపై నివేదిక రూపొందించాలి. 19న పాత భవనాల పునరుద్ధరణకు, కొత్త భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి. 30న కొత్త భవనాలన నిర్మానానికి స్థల సేకరణ చేపట్టాలి. ఖాళీ భవనాలు ఉంటే ఎంపిక చేయాలి. జులై 30న క్యాంటీన్లలో భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఎంపిక చేయాలి. ఆగస్టు పదిన ఎంపిక చేసిన వారికి పనులు అప్పగించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. 15న సంస్థలతో అగ్రిమెంట్ చేసుకోవాలి. సెప్టెంబర్‌ 21లోపు 203 క్యాంటీన్లు ప్రారంభించాలి.