Delhi Temperature:  ఢిల్లీలో ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. దేశ రాజధానిలో ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ప్రకృతి కరుణించింది. ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారి తుఫాను, వర్షం కారణంగా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ వర్షం ఢిల్లీ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. అంతకుముందు బుధవారం ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. వచ్చే 24 గంటల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని గతంలో వాతావరణ శాఖ తెలిపింది.


ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని కొన్ని చోట్ల మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ అకస్మాత్తుగా సూర్యరశ్మి మాయమై ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత చిరుజల్లులు, ఈదురుగాలులు వీచాయి. నోయిడాలో కూడా వర్షం కురిసింది.. దీంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. ఇక్కడ ప్రజలు రోడ్డుపై వర్షంలో తడుస్తూ ఆనందించారు.  


రానున్న కొద్ది గంటల్లో నజాఫ్‌గఢ్, పాలెం, ఆయనగర్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది కాకుండా, ఎన్‌సిఆర్, హర్యానాలోని రోహ్‌తక్, సోనిపట్, గోహనా, అనేక ఇతర ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉంది.  బులంద్‌షహర్, హపూర్, సియానాతో సహా ఉత్తరప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తుంది.


రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది ?   
ఐఎండీ ప్రాంతీయ అధిపతి డాక్టర్ కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, 'ఈరోజు ముంగేష్‌పూర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ప్రస్తుతం  ప్రాణాంతకమైన వేడిగాలులు వీస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇలాంటి పరిస్థితులు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మరో ఒకట్రెండు గంటల పాటు కొనసాగుతాయి. గురువారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసాం. ఉష్ణోగ్రతలో 2-3 డిగ్రీల తగ్గుదల ఉంటుంది. పశ్చిమ డిస్ట్రబెన్స్ కారణంగా.. మే 31, జూన్ 1 తేదీలలో ఢిల్లీ-ఎన్‌సిఆర్, మొత్తం వాయువ్య ప్రాంతంలో ఉరుములు,  మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. జూన్ 1 నుండి ఉష్ణోగ్రత 3-4 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది.


హీట్ రికార్డ్ బద్దలు
ఢిల్లీలోని ముంగేష్‌పూర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది దేశ రాజధానిలో ఇంత ఉష్ణోత్రత ఎన్నడూ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. మంగళవారం వాయువ్య ఢిల్లీలోని ముగెన్‌ష్‌పూర్‌లో 49.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.  ఒక రోజు తర్వాత ఉష్ణోగ్రత మరింత పెరిగి, సాయంత్రం 4.14 గంటలకు వాతావరణ కేంద్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని భారత వాతావరణ శాఖ అధికారి  తెలిపారు. ఈ రోజు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో మండే వేడి గాలులు తీవ్రంగా మారవచ్చు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి.  కొన్ని ప్రాంతాల్లో జూన్ 1 వరకు వేడిగాలుల పరిస్థితులు కొనసాగుతాయని అంచనా.


రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్
ఢిల్లీలో మండుతున్న వేడి వల్ల  విద్యుత్ వినియోగం బుధవారం అత్యధిక స్థాయి 8,302 మెగావాట్లకు చేరుకుంది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులు తెలిపారు. ఢిల్లీ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా విద్యుత్ డిమాండ్ 8,300 మెగావాట్ల మార్కును దాటింది. ఈ వేసవిలో గరిష్ట డిమాండ్ 8,200 మెగావాట్లు ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థలు అంచనా వేశాయి. నగరంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ మధ్యాహ్నం 3.36 గంటలకు 8,302 మెగావాట్లుగా ఉంది.


నీటిని వృధా చేస్తే జరిమానా
రాజధాని నగరంలో నీటిని వృధా చేసినందుకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 2,000 జరిమానాను ప్రకటించింది. యమునా నది నుంచి ఢిల్లీ వాటా నీటిని హర్యానా విడుదల చేయడం లేదని ఢిల్లీ మంత్రి ఆతిషి ఆరోపించారు. దీంతో కార్లు కడగడానికి నీటిని ఉపయోగించడం, వాటర్ ట్యాంకులు పొంగిపొర్లడం, గృహనిర్మాణం, వాణిజ్య అవసరాల కోసం గృహ నీటిని ఉపయోగించడం వంటి వాటికి జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.