Elections 2024 :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కౌంటింగ్‌ దిశగా సాగుతున్నాయి. పోలింగ్ తర్వాత విశ్రాంతిలో ఉన్న అగ్రనేతలు మళ్లీ  యాక్టివ్ అవుతున్నారు. విదేశీ పర్యటన నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం తిరిగి హైదరాబాద్ వచ్చారు. గురువారం సాయంత్రం ఆయన అమరావతి చేరుకునే అవకాశం ఉంది. ఉండవల్లి నివాసానికి వచ్చిన తర్వాత టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమవుతారు. శుక్రవారం రోజున పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.  పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలపై ఇరువురు నేతలు సమీక్షించే అవకాశం ఉంది. అదే రోజున  31న బిజెపి నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుల్సోతంది.  


పార్టీ నాయకులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్               


మరో వైపు హైదరాబాద్ చేరిన వెంటనే  టీడీపీ కీలక నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్  నిర్వహించారు.  శుక్రవారం పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం  అవనున్నారు. అలాగే జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.   2 కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశాలు  జారీ చేశారు.    కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.  175 నియోజకవర్గాలకు  120 మంది పరిశీలకులను నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరం  వ్యక్తం చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని..  ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని చంద్రబాబు తెలిపారు.  ఈసీ, పోలీసులు తీరుపై అందుకే విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు స్పష్టం చేశారు.                   


పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలపై చర్చ                                     


పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాశి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. పవన్ కల్యాణ్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయినట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలతో పూర్తి స్థాయిలో పోలింగ్ సరళిని విశ్లేషించారని చెబుతున్నారు. కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని ఇప్పటికే  టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. ప్రధాని మోదీ, అమిత్ షా కూడా గెలుపు ఖాయమని చెబుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.             


పోస్టల్ బ్యాలెట్ పై అప్రమత్తంగా ఉండాలని  నిర్ణయం                          


పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తిరుపతి, తాడిపత్రి, పల్నాడు జిల్లాల్లో చోటు చేసుకున్న ఘర్షణల విషయంలో జరిగిన పరిణామాలపైనా  నేతలిద్దరూ చర్చించే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని  వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కౌంటింగ్ లో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటుందని పేర్ని  నాని హెచ్చరించారు. ఇది ఓ ప్రణాళిక ప్రకారం చేసిందేనని... టీడీపీ, జనేసన వర్గాలు అనుమానిస్తున్నాయి.