Iran's New President: ఇరాన్‌కి కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ మొక్బర్‌ ఎన్నికయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్ల అలీ ఆయనను అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకూ మొక్బర్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగనున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం చూస్తే అధ్యక్షుడు ఆకస్మికంగా చనిపోతే కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ ప్రోటోకాల్స్ ఆధారంగానే తరవాతి అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఈ నిబంధన ప్రకారమైతే..వైస్‌ ప్రెసిడెంట్‌కి తాత్కాలికంగా ఆ బాధ్యతలు అప్పగించాలి. ఆ లెక్కన ప్రస్తుతం ఇరాన్‌కి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న మహమ్మద్ మొక్బర్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా (Mohammad Mokhber) బాధ్యతలు తీసుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీతో సాన్నిహిత్యం ఉన్న మొక్బర్‌కి ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం ఉంది. ఆయన అధ్యక్షతన పార్లమెంటరీ స్పీకర్, జ్యుడీషియరీ చీఫ్ ఓ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. 


50 రోజుల్లోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈ కౌన్సిల్‌దే. అయితే...ఈ ప్రక్రియకు సుప్రీం లీడర్ అనుమతి తప్పని సరి. ఇరాన్ రాజకీయాలకు సుపరిచితమైన మహమ్మద్ మొక్బర్ 2021లో రైసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. Reuters వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది అక్టోబర్‌లో మాస్కోకి వెళ్లారు మహమ్మద్ మొక్బర్. మిజైల్స్‌, డ్రోన్స్‌ని రష్యాకి సప్లై చేసేందుకు ఓ డీల్ కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయంగానే కాకుండా దేశ రక్షణకు సంబంధించిన ఎన్నో కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంది.