అఫ్గానిస్థాన్ లో అధికారంలోకి వచ్చినా తర్వాత తాలిబన్లు ఒక్కొక్కటిగా తమ విధానాలను ప్రకటిస్తున్నారు. మహిళలపై తమ వైఖరి మారిందని ఇప్పటివరకు పైకి చెప్పిన తాలిబన్లు.. తాజాగా చేస్తోన్న ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. తాలిబన్ల సర్కార్ లో విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
పురుషులతో సంబంధం లేకుండా మహిళలు చదువుకోవడానికి సిద్ధమయ్యే వరకు వారికి యూనివర్సిటీల్లోకి అనుమతి లేదని ఆయన చెప్పుకొచ్చారు.
డ్రెస్ కోడ్ లు..
చదువుకునే మహిళలు కచ్చితంగా ప్రత్యేక డ్రెస్ కోడ్ పాటించాలని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. 1990ల నాటి పాలనలో తాలిబన్లు మహిళలను చదువుకోవడానికి అనుమతించలేదు. వారిని పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. దీంతో తాలిబన్లు మరోసారి అధికారంలోకి రాగానే నాటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంతా ఆందోళన చెందారు. అయితే, తమ పాలన క్రితంతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని తాలిబన్లు చెప్పుకొస్తున్నారు.
తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లా హాషిమి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.
ప్రమాణస్వీకారం వాయిదా..
అఫ్గానిస్థాన్‌లో సెప్టెంబర్ 11న జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని తాలిబన్లు ఇటీవల వాయిదా వేసుకున్నారు. గతంలో న్యూయార్క్ ట్విన్ టవర్స్‌ను కూల్చిన రోజు (9/11) ప్రమాణస్వీకారం నిర్వహించాలని చూసినప్పటికీ మిత్రపక్ష దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు.