అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ గుర్తిస్తుందా? లేదా? అనే అంశంపై ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది. అసలు తాలిబన్లను ప్రభుత్వం ఉగ్రవాదులుగానే చూస్తుందా? అని కేంద్రంపై విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఈ ప్రశ్నలను ప్రస్తుతానికి దాటవేస్తోంది. అఫ్గాన్ తాజా పరిణామాలపై ఈరోజు భారత విదేశాంగ శాఖ మీడియాతో మాట్లాడింది.
ప్రస్తుతం తమ దృష్టంతా అఫ్గాన్ ఉగ్రవాదానికి అడ్డా కాకుండా చూడటంపైనే ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. తాలిబన్లతో ఖతార్ లో భారత రాయబారి చేసిన చర్చలపైనా స్పందించారు.
ఖతార్ లో జరిగిన చర్చల్లో తాలిబన్ల నుంచి భారత్ కు సానుకూల స్పందన వచ్చింది. అయితే ఇది కేవలం భేటీ. ఈ చర్చల ఆధారంగా ఏం చెప్పలేం. వారి ప్రభుత్వాన్ని గుర్తిస్తామా లేదా అనేది అప్పుడే చెప్పలేం. తాలిబన్లతో మరిన్ని చర్చలు జరుగుతాయా అనే ప్రశ్నకు కూడా నా వద్ద సమాధానం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేం. - అరిందమ్ బాగ్చి, విదేశాంగ ప్రతినిధి
ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు జరగట్లేదని ఆయన అన్నారు. తిరిగి మొదలైన వెంటనే ప్రజల తరలింపు మొదలుపెడతామని తెలిపారు.