20 ఏళ్ల తర్వాత అఫ్గానిస్థాన్ ను వదిలి అమెరికా దళాలు తిరిగి వెళ్లిపోవడంపై ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా స్పందించింది. ఇది తాలిబన్ల విజయంగా పేర్కొంటూ వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు అల్ ఖైదా నాయకత్వం రెండు పేజీల ప్రకటనను విడుదల చేసింది. తమ హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయని అల్ ఖైదా తెలిపింది.
తాలిబన్లపై ప్రశంసలు..
అమెరికా నుంచి అఫ్గాన్ కు స్వేచ్ఛ ప్రసాదించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు. ఇష్టారాజ్యంగా నడుచుకుందామనుకున్న అమెరికాకు ఇది ఘోర పరాభావం. - అల్ ఖైదా
కశ్మీర్ కు స్వేచ్ఛ కల్పించండి..
ఇస్లామిక్ ప్రాంతాలుగా పిలిచే కశ్మీర్ సహా పలు ప్రాంతాలకు ఇస్లామ్ శత్రువుల నుంచి స్వేచ్ఛ కల్పించాలని అల్ ఖైదా తాలిబన్లకు తెలిపింది.
ఓ అల్లాహ్!.. లెవెంట్, సొమాలియా, యెమన్, కశ్మీర్ సహా మిగిలిన ఇస్లామిక్ ప్రాంతాలకు మన శత్రువుల నుంచి స్వేచ్ఛ కల్పించాలి. ప్రపంచవ్యాప్తంగా బందీలుగా మగ్గిపోతున్న ముస్లింలకు స్వేచ్ఛను ఇవ్వండి.
అల్ ఖైదా
రెండు దశాబ్దాలుగా అఫ్గానిస్థాన్‌లో ఉన్న అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడంపై బైడెన్ కు ఎదురుగాలి వీస్తుంది. ప్రతిపక్ష పార్టీ నేతలు అధ్యక్షుడు జో బైడెన్ ను తప్పుపడుతున్నారు. అఫ్గానిస్థాన్ ను సమస్యల వలయంలో విడిచి వచ్చారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తాలిబన్లు ఇచ్చిన గడువు ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటాక అమెరికా బలగాలను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పించారు.
Also Read: Joe Biden: అమెరికా బలగాల ఉపసంహరణ సరైన నిర్ణయమే.. తాలిబన్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.. జో బైడెన్