మతాంతర వివాహాలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమకు నచ్చిన జీవిత భాగస్వామిని వివాహం చేసుకునే హక్కు మేజర్లకు ఉంటుందని.. దీనికి మతంతో సంబంధం లేదని తెలిపింది. మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటకు రక్షణ కల్పిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఇద్దరు మేజర్ (అడల్ట్స్) అయిన వ్యక్తులు ఒకరినొకరు ఇష్టపడినప్పుడు, వారి తల్లిదండ్రులు కూడా వారి సంబంధాన్ని వ్యతిరేకించలేరని స్పష్టం చేసింది. జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, దీపక్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యానించింది.  


తమకు రక్షణ కల్పించాలని కోరుతూ.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షిఫా హాసన్, ఆమె భాగస్వామి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో హాసన్ ముస్లిం కాగా.. ఆమె భాగస్వామి హిందూ మతానికి చెందిన వ్యక్తి. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని.. ఇష్టపూర్వకంగా కలిసి జీవిస్తున్నామని హాసన్ కోర్టుకు తెలిపింది. తమ వివాహానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పింది. అబ్బాయి తల్లి అంగీకారం తెలిపినా.. తండ్రి సమ్మతించలేదని పేర్కొంది. దీంతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని తమకు రక్షణ కల్పించాలని కోర్టును కోరింది. తాను హిందువుగా మారాలనుకుంటున్నానని.. దీని కోసం దరఖాస్తు కూడా దాఖలు చేశానని హాసన్ కోర్టుకు తెలిపింది. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. వారికి ఎలాంటి ఆపద కలగకుండా రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. హాసన్ తండ్రి లేదా మరే ఇతర వ్యక్తి ద్వారా అయినా వేధింపులకు గురి కాకుండా చూసుకోవాలని పేర్కొంది.  


గతంలోనూ కీలక వ్యాఖ్యలు
భారత సంస్కృతిలో ఆవు ఎంతో ముఖ్యమైనదని.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడంతోపాటు గోసంరక్షణను హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు.. ఆవులకు జాతీయ జంతువు హోదా ఇవ్వడానికి పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. ఆవులు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం సంతోషంగా ఉంటుందని హైకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. 


Also Read: PM Modi Birthday: ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ... 71వ వసంతంలోకి అడుగుపెట్టిన మోదీ.. ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు


Also Read: Amit Shah Meeting: తెలంగాణలో అమిత్ షా పర్యటన... నిర్మల్ లో భారీ బహిరంగ సభ... టీఆర్ఎస్ విమర్శలు చేస్తారా? బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ