Aditya-L1 Mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవలే ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆదిత్య ఎల్ 1 భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉంది. త్వరలోనే లాగ్రాంజ్ బిందువును చేరుకోబోతుంది. ఆదిత్య ఆ బిందువును చేరడానికి ముందే సౌర పవనంలోని విద్యుదావేశ కణాలపై అధ్యయనం ప్రారంభించింది. అయితే ఆదిత్య ఎల్1 తన జీవిత కాలం అంతా అధ్యయనం కొనసాగిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌర పవనంలోని కణాలు నిరంతరం భూమిని తాకుతుంటాయి. అయితే వారి పరిశీలనకు భారత భౌతిక శాస్త్ర పరిశోధన సంస్థ, అంతరిక్ష అన్వయ కేంద్రం కలిసి సుప్రా థర్మల్ ఎనర్జిటిక్‌ స్పెక్ట్రో మీటర్‌ అనే సాధనాన్ని తయారు చేశాయి. భూ అయస్కాంత క్షేత్రం, సౌర కణాల మధ్య చర్య, ప్రతిచర్యలను అవి అధ్యయనం చేస్తాయి. దీనివల్ల అంతరిక్షంలోని మన ఉపగ్రహాలను సౌర కణాల తాకిడి నుంచి కాపాడుకోవచ్చు. సెప్టెంబర్ 10వ తేదీన ఆదిత్య భూమ్యోపరితలానికి 52 వేల కిలో మీటర్ల ఎత్తును చేరినప్పటి నుంచి స్టెప్స్ పని ప్రారంభించింది. 


ఉపగ్రహ భూకక్ష్యను ఆదిత్య ఎల్ 1 ఇప్పటికే నాలుగు సార్లు పెంచిన విషయం తెలిసిందే. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య-ఎల్1 ను మరొక విన్యాసంతో ఎల్1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఇప్పటి వరకు 5 లగ్రాంజియాన్ పాయింట్లను గుర్తించారు శాస్త్రవేత్తలు. వీటిల్లో ఆదిత్య-ఎల్1 తొలి లగ్రాంజ్ పాయింట్ కు వెళ్తోంది. ఇది భూమితో పాటు సూర్యుడి చుట్టూ ఆవరించి ఉంటుంది. కాబట్టి ఆదిత్యుడి పరిశీలనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని పరిశీలించడానికి వీలు ఉంటుంది. ఈ కేంద్రం నుంచే ఆదిత్య-ఎల్1 సూర్యుడిపై అధ్యయనం జరుపుతుంది. 


ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ (ASPEX) పేలోడ్ లో భాగమైన హీ సుప్రా థర్మల్ & ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ ఇన్‌స్ట్రుమెంట్ సెన్సార్లు 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న సుప్రా-థర్మల్, ఎనర్జిటిక్ అయాన్ లు, ఎలక్ట్రాన్ లను కొలవడం ప్రారంభించాయని సోమవారం ఇస్రో తెలిపింది. భూమి నుంచి ఈ డేటా శాస్త్రవేత్తలకు భూమి చుట్టూ ఉన్న కణాల ప్రవర్తనను విశ్లేషించడంలో సహాయపడతాయి. 


L1కి చేరుకున్నాక..?


ఒక్కసారి L1 ఫేజ్‌కి చేరుకున్న తరవాత ఆదిత్య L1 ఇంజిన్‌ల సాయంతో పాథ్ మార్చుతారు. అక్కడి నుంచి క్రమంగా L1 Halo Orbitలోకి ప్రవేశిస్తుంది. ఆ పాయింట్ వద్దే ఇది స్టేబుల్‌గా ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్ వద్ద భూమి గురుత్వాకర్షణ శక్తి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ అవడం వల్ల ఆదిత్య L1 అక్కడే స్థిరంగా ఉంటుంది. అయితే...సైంటిస్ట్‌లు చెబుతున్న వివరాల ప్రకారం...అది అక్కడ స్టేబుల్‌గా ఉండకుండా చాలా నెమ్మదిగా కదులుతుంది. అక్కడి నుంచే సూర్యుడికి సంబంధించిన కీలక వివరాలు సేకరిస్తుంది. రోజుకి 14 వందలకు పైగా ఫొటోలు తీసి పంపుతుంది. లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత Visible Emission Line Coronagraph (VELC) సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది. ఇప్పటికే చంద్రయాన్ 3 సక్సెస్‌తో జోష్ మీదున్న ఇస్రో...ఈ ప్రయోగం కూడా విజయవంతం అవుతుందన్న ధీమాతో ఉంది.