Adhir Ranjan on Smriti Irani: రాష్ట్రపతిని అవమానించారు, స్మృతి ఇరానీకి అధీర్ రంజన్ కౌంటర్ - లోక్‌సభ స్పీకర్‌కు లేఖ
Adhir Ranjan on Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, సభలో ద్రౌపది ముర్ము పేరు ప్రస్తావించిన సమయంలో "హానరబుల్ ప్రెసిడెంట్" అని అనకుండా అవమానించారని...కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ కౌంటర్ ఇచ్చారు.

Adhir Ranjan on Smriti Irani :
ప్రెసిడెంట్ అని ఎక్కడా ప్రస్తావించలేదు: అధీర్ రంజన్
కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ "రాష్ట్రపత్ని" వ్యాఖ్యలు పార్లమెంట్‌లో ఎంత దుమారం రేపాయో తెలిసిందే. దాదాపు రెండు రోజులుగా దీనిపైనే కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చివరకు అధీర్ రంజన్...రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు. ఇక్కడితో ఈ వివాదం ముగిసినట్టే అనుకున్నారంతా. కానీ...దీని తరవాతే మరో మలుపు తిరిగింది. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌పై తీవ్రంగా మండి పడుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పదేపదే ద్రౌపది ముర్ము పేరుని ప్రస్తావించారు. అయితే...ఈ సమయంలో ఆమె ఎక్కడా "హానరబుల్ ప్రెసిడెంట్" అని అనలేదని, స్మృతి ఇరానీ...రాష్ట్రపతిని అవమానించారని అధీర్ రంజన్ చౌదరి కౌంటర్ ఇచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. "స్మృతి ఇరానీ ఎన్నో సార్లు ద్రౌపది ముర్ము పేరుని గట్టిగా పలికారు. కానీ ఆమె ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అని ఎక్కడా గౌరవంగా మాట్లాడలేదు. ఆ ప్రిఫిక్స్ లేకుండా నేరుగా పేరునే ప్రస్తావించారు. ఇలా ఆమెను అవమానించారు" అని ఆ లెటర్‌లో పేర్కొన్నారు అధీర్ రంజన్. "సభలో స్మృతి ఇరానీ ఆమె పేరుని పలికిన విధానం ఏ మాత్రం సబబు కాదు. ఆ పదవిని అవమానించారు" అని అందులో రాశారు. సభను అవమానించేలా ఉన్న ఈ కామెంట్స్‌ని పార్లమెంట్ ప్రొసీడింగ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వివాదానికి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి ఎలాంటి సంబంధం లేదని, ఆమె పేరుని కూడా ఈ ప్రొసీడింగ్స్ నుంచి తొలగించాలని ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసి క్షమాపణ కోరారు. మీరు నిర్వహిస్తున్న పదవిని ఉద్దేశించి పొరపాటున సరికాని పదాన్ని వాడినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని రాష్ట్రపతి ముర్ముకు రాసిన లేఖలో అధిర్ రంజన్ పేర్కొన్నారు. పొరపాటున నోరు జారి ఆ పదాన్ని వాడినందుకు క్షమాపణ కోరుతున్నానని దీన్ని మీరు అంగీకరించాలని కాంగ్రెస్ నేత ఆ లేఖలో కోరారు.
Also Read: Monkey Pox Case in AP: ఏపీలో మంకీపాక్స్ కలకలం, 8 ఏళ్ల బాలుడిలో అనుమానిత కేసు!