Monkey Pox Case in AP: దేశంలో క్రమేణా మంకీపాక్స్ అనుమానిత కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతుండగా.. ప్రజలంతా భయపడిపోతున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మంకీపాక్స్ అనుమానిత కేసులు రాగా.. కేరళలో నాలుగు కేసులను నిర్దారించారు. తాజాగా దిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లోనూ నమోదు అయింది. ఇక ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లోనూ మంకీపాక్స్ అనుమానిత కేసులు బయటకు వస్తున్నాయి. తాజాగా ఏపీలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసును గుంటూరులో గుర్తించారు. 


8 ఏళ్ల బాలుడిలో మంకీపాక్స్ అనుమానిత కేసు..


ఒంటిపై దద్దుర్లు ఉన్న 8 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్ లో చేర్పించారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. నివేదికను అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు.. ఒడిశా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం బాలుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్ అందిస్తున్నారు. 


మంకీపాక్స్ పై అప్రమత్తమైన ప్రభుత్వాలు..!


ఇప్పటికే కేంద్రం మంకీపాక్స్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ లక్షణాలు, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ విధి, విధానాలను ఖరారు చేసింది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని కామారెడ్డిలో అనుమానిత మంకీపాక్స్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మంకీపాక్స్ లక్షణాలతో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనుమానితుడి నుంచి రక్త నమూనాలను సేకరించి పూణేలోని ఎన్ఐసీకి పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత.. కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిలో మంకీపాక్స్ నెగటివ్ గా వచ్చినట్లు తెలిపారు.


ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంకీ పాక్స్ గా నిర్ధారణ అయిన కేసులు లేవు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనే అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తించిన కేసుకు సంబంధించి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే ఆ బాలడికి మంకీపాక్స్ ఉందా లేదా అనేది నిర్ధారణ కానుంది. 


కేంద్ర ప్రభుత్వం సూచనలు..


వ్యాధి నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు చేయడం, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఈ టాస్క్ ఫోర్స్ సూచనలు చేస్తుందని తెలిపాయి. ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన చర్యలు, ప్రజారోగ్యానికి సంబంధించిన ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఈ సమావేశం జరిగింది. కేబినెట్ కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్సి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు నాలుగు మంకీపాక్స్ కేలు బయట పడ్డాయి. అందులో మూడు కేరళ, ఒకటి దీల్లీకి చెందిన కేసులుగా తెలిపారు.