Bilkis Bano : గుజరాత్ అల్లర్లు-2002 సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె కుటుంబ సభ్యుల ఏడుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో 11 మంది దోషులు మంగళవారంనాడు జైలు నుంచి విడుదలయ్యారు. 2002 ఫిబ్రవరిలో గుజరాత్లోని గోద్రాలో జరిగిన అల్లర్లలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమె మూడేళ్ల కూతరితో పాటు మరో ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి మరో ఆరుగురు తప్పించుకున్నారు. ఈ ఘటనపై అప్పట్లో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను 2004లో అరెస్ట్ చేశారు.2008 జనవరి 1న వీరికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది.
అయితే ఇదే కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. శిక్ష పడిన వారిని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన ఖైదీల కింద విడుదల చేసేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 11 మంది దోషులు తాజాగా విడుదలయ్యారు. వీరికి పాదాభివందనం చేస్తూ స్వీట్లు తినిపిస్తూ స్వాగతం పలకిన వీడియో వైరల్ అవుతోంది, నేరస్తులు వరుసగా నిల్చోగా, ఒక వ్యక్తి వారికి పాదాభివందనం చేస్తూ స్వీట్లు పంచాడు.
వీరిని విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది. అత్యాచారం వంటి కేసులున్న వారిని విడుదల చేయకూడదన్న నిబంధనలను కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పలువురు వారు చేసిన నేరాలను వివరిస్తూ.. ట్వీట్లు చేశారు. ఇలాంటి వారిని సమాజంలోకి ఎలా రానిస్తారని ప్రశ్నిస్తున్నారు.