Milk Price  :   పాల ధరలు మళ్లీ పెరిగాయి.  గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్  అమూల్ బ్రాండ్‌తో అమ్మే పాల ధరలను పెంచేసింది.  లీటరుకు రెండు రూపాయల చొప్పున ధరలను పెంచింది.  సవరించిన ధరలు  బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. పాల ధరను రూ. 2 పెంచడం వల్ల ఎంఆర్‌పిలో 4 శాతం పెంపు ఉంటుందని అమూల్ తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ,సౌరాష్ట్ర మార్కెట్స్‌, ఢిల్లీ-ఎన్‌సిఆర్, పశ్చిమ బెంగాల్, ముంబైతోపాటు అమూల్ తాజా పాలను విక్రయించే అన్ని ఇతర మార్కెట్‌లలో  ఈ సవరించిన ధరలు అమల్లో ఉంటాయని  అమూల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 





అమూల్ గోల్డ్ ధర 500 మి.లీ రూ. 31, అమూల్ తాజా 500 మి.లీ రూ. 25, అమూల్ శక్తి 500 మి.లీ ధర రూ. 28లు చెల్లించాల్సి ఉంటుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.53 కి పెరిగింది.  మొత్తం నిర్వహణ వ్యయం , ఉత్పత్తి ఖర్చులు  పెరుగుదల కారణంగా ఈ ధరల పెంపు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతానికి పెరిగింది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, తబ సభ్య సంఘాలు కూడా గత ఏడాది కంటే రైతుల ధరలను 8-9 శాతం వరకు పెంచాయని అమూల్‌ తెలిపింది. 


అమూల్ బాట‌లో మ‌ద‌ర్ డెయిరీ ప‌య‌నిస్తున్న‌ది. బుధ‌వారం నుంచి లీట‌ర్ పాల ధ‌ర రూ.2 పెంచుతున్న‌ట్లు మంగ‌ళవారం ప్ర‌క‌టించింది. పాల సేక‌ర‌ణ ధ‌ర‌, ఇత‌ర ఇన్‌పుట్ కాస్ట్ పెర‌గ‌డంతో పాల ధ‌ర పెంచ‌క త‌ప్ప‌డం లేద‌ని తెలిపింది. ఇంత‌కుముందు మార్చిలో లీట‌ర్ పాల‌పై రూ.2 పెంచేసింది. ఢిల్లీతోపాటు నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ (ఎన్సీఆర్‌) పాల స‌ర‌ఫ‌రా చేస్తున్న ప్ర‌ధాన సంస్థ‌ల్లో ఒక‌టి మ‌ద‌ర్ డెయిరీ. ప్ర‌తి రోజూ 30 ల‌క్ష‌ల లీట‌ర్ల‌కు పైగా పాల‌ను విక్ర‌యిస్తున్న‌ది. బుధ‌వారం నుంచి పెంచిన పాల ధ‌ర‌లు ఇలా అమ‌ల్లోకి వ‌స్తాయి.



లిక్విడ్ మిల్క్ పాల ధ‌ర రూ.2 పెరుగుతుంద‌ని తెలిపింది మ‌ద‌ర్ డెయిరీ. ఈ ధ‌ర పెంపు అన్ని మిల్క్ వేరియంట్ల‌కు వ‌ర్తిస్తుందని పేర్కొంది. ఫుల్ క్రీమ్ మిల్క్ లీట‌ర్ ధ‌ర రూ.59 నుంచి రూ.61కి.. టోన్డ్ మిల్క్ లీట‌ర్ రూ.51కి, డబుల్ టోన్డ్ మిల్క్ ధ‌ర రూ.45కి పెరుగుతుంది. ఆవు పాలు లీట‌ర్ రూ.53ల‌కు ల‌భిస్తాయి. బ‌ల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్‌) లీట‌ర్ ధ‌ర రూ.46 నుంచి రూ.48కి చేరుకుంది.


గ‌త ఐదు నెల‌లుగా వివిధ ఇన్‌పుట్ వ్య‌యాలు పెరిగిపోయాయ‌ని మ‌ద‌ర్ డెయిరీ అధికారులు తెలిపారు. ముడి పాల ధ‌ర‌లు సుమారు 10-11 శాతం పెరిగాయి. గ‌త వేస‌వి సీజ‌న్‌లో వేడి తీవ్ర‌త వ‌ల్ల పశుగ్రాసం ధ‌ర గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈ కంపెనీలు ధరలు పెంచినందున ఇతర కంపెనీలు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతూంటే..  ఇప్పుడు పాల ధరలు మరోసారి వడ్డించడం ప్రజాగ్రహానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది.