Zoji La Tunnel Significance: జమ్ముకశ్మీర్,లద్దాఖ్‌లలో మౌలిక వసతుల రూపురేఖలు మార్చేస్తున్నామని చెబుతోంది మోదీ సర్కార్. అందుకు తగ్గట్టుగానే ఎక్కడికక్కడ కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతోంది. భౌగోళికంగా ఉన్న సవాళ్లను అధిగమిస్తూనే కొండలు గుట్టల మధ్య సొరంగ మార్గాలు నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనగర్ నుంచి గగాంగిర్ వ్యాలీని కనెక్ట్ చేస్తూ Z-Morh tunnel ని నిర్మిస్తోంది. 6.5 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గాన్ని Thajiwas Glacier కింద నిర్మిస్తున్నారు. పర్యాటకుల స్వర్గధామంగా పిలుచుకునే సోనామార్గ్‌ని ఇది కనెక్ట్ చేస్తుంది. సాధారణంగా శీతాకాలంలో ఈ దారంతో మంచుతో నిండిపోతుంది. పర్యాటకులు అక్కడికి వెళ్లేందుకు దారి ఉండదు. ఈ సమస్యకి పరిష్కారంగానే ఇక్కడ సొరంగ మార్గాన్ని నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
జమ్ముకశ్మీర్‌లో చేపడుతున్న అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌లలో ఇదీ ఒకటి. ఈ ప్రాజెక్ట్‌పై ABP Live గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించింది. ABP రిపోర్టర్ అక్కడి పరిస్థితులను పూర్తిస్థాయిలో వివరించారు. ఈ సొరంగ మార్గం పూర్తైతే అటు రక్షణ పరంగానూ అది గేమ్ ఛేంజర్‌గా మారనుంది. అంతే కాదు. ఆసియాలోనే అతి పెద్ద టన్నెల్‌గా రికార్డుకెక్కనున్న Zoji La Tunnel నీ అనుసంధానించనుంది ఈ Z-Morh tunnel.ఈ రెండింటి మధ్య ఓ అప్రోచ్ రోడ్ నిర్మించనున్నారు.
14 కిలోమీటర్ల మేర నిర్మించనున్న Zoji La Tunnel పూర్తైతే కశ్మీర్ నుంచి లద్దాఖ్‌కి ప్రయాణ భారాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు. Line of Controlతో పాటు LAC వద్ద భారత సైనికులు మొహరించేందుకు మార్గం మరింత సులభం కానుంది. ప్రస్తుతానికి జోజిలా పాస్ దాటాలంటే కనీసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ఈ సొరంగ మార్గం పూర్తైతే కేవలం 20 నిముషాల్లోనే చేరుకోవచ్చు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ప్రయాణానికి ఇబ్బంది ఉండదు. మంచుతుఫాన్‌లు, కొండచరియలు విరిగిపడడం లాంటి ఘటనల కారణంగా రెండు మూడు నెలల పాటు జోజిలా పాస్ మూతబడే ఉంటోంది. ఈ సమయంలో ఇండియన్ ఆర్మీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ABP Liveతో అధికారులు వెల్లడించారు.
నిజానికి 2005లోనే Zoji La Tunnel ని నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ అప్పటి నుంచి అది వాయిదా పడుతూ వస్తోంది. 2013లో ఈ ప్రాజెక్ట్ Border Roads Organisation (BRO) పరిధిలోకి వెళ్లింది. ఆ తరవాత 2014లో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2023 నాటికే పూర్తి చేయాలని భావించినా ఆ డెడ్‌లైన్‌ని 2027కి మార్చారు. ప్రకృతి విపత్తుల కారణంగా నిర్మాణం ఆలస్యమైంది. గుర్రపు డెక్క ఆకారంలో 7.57 మీటర్ల ఎత్తులో రెండు లేన్‌ల టన్నెల్‌ని నిర్మిస్తారు. ఇందులో సీసీకెమెరాలతో పాటు రేడియో కంట్రోల్, నిరంతరాయ విద్యుత్ సరఫరా, వెంటిలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అధునాతన సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.5 వేల కోట్లు ఆదా అయింది.
గేమ్ ఛేంజర్..
రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ రాకేశ్ శర్మ ఈ ప్రాజెక్ట్ గురించి ABP Liveతో కీలక వివరాలు పంచుకున్నారు. రిజర్వ్ బలగాలను ఎప్పటికప్పుడు ఒక చోట నుంచి మరో చోటకు తరలించేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుందని వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో చైనా, పాకిస్థాన్‌తో తలపడేందుకూ వీలవుతుందని వివరించారు. లద్దాఖ్ ప్రజలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా మిగతా ప్రాంతాల వాళ్లతో అనుసంధానం అవడానికీ లైన్ క్లియర్ అవుతుందని చెప్పారు. ఇదే సమయంలో రాకేశ్ శర్మ 1947 తరవాత భారత్-పాకిస్థాన్ పరిస్థితుల గురించీ వివరించారు.
"జోజి లా టన్నెల్ గురించి ప్రస్తావన వస్తే 1947లో నవంబర్ 2వ తేదీన గిల్గిట్ ప్రాంత ఆక్రమణ గుర్తొస్తుంది. 1948లో పాక్ సైన్యం కార్గిల్‌తో పాటు ద్రాస్‌ని ఆక్రమించింది. ఆ తరవాత లేహ్‌పైనా పట్టు సాధించింది. 11,575 అడుగుల ఎత్తులో ఉన్న జోజి లా లద్దాఖ్‌కి గేట్‌వేగా ఉంది. ఇక్కడా పాక్ సైన్యం దాడి చేసింది. రెండు సార్లు దాడులు జరిగాయి"
- రాకేశ్ శర్మ, రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్
మాజీ దౌత్య వేత్త పుంచోక్ స్తోబ్దన్ కూడా ఈ ప్రాజెక్ట్‌ని ప్రశంసించారు. ABP Newsతో ప్రత్యేకంగా మాట్లాడారు. కశ్మీర్ నుంచి లద్దాఖ్‌కి భారతీయ సైనికులు వెళ్లేందుకు ఈ సొరంగ మార్గం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. గతేడాది ఏప్రిల్‌లో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సొరంగ నిర్మాణ పనులను పరిశీలించారు. మరో మూడేళ్లలో ఈ టన్నెల్ అందుబాటులోకి రానుంది.
Also Read: PM Modi: మోదీ ధ్యానం వెనక ఇంత స్ట్రాటెజీ ఉందా? ఆ ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నట్టు?