ఏబీపీ గ్రూప్‌ వందో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆనంద బజార్‌ పత్రిక ప్రారంభించినప్పటి నుంచి భారతీయ మీడియా రంగంలో సాహసోపేతమైన పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. శతాబ్ది ఉత్సవాల్లో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో ప్రజలంతా ధైర్యంగా నిలబడాల్సిన సమయంలో ఆనంద్ బజార్ పత్రిక వారికి అండగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా ఏబీపీ గ్రూప్‌నకు సంబంధించిన పలు కీలక విషయాలను, విజయాలను ప్రస్తావించారు. అప్పటి రోజులను గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


ఏబీపీ గ్రూప్ మతసామరస్యానికి తోడ్పడుతోంది..
  
"తొలిరోజు వార్తాపత్రికను ఎరుపు రంగులో ముద్రించారు. అప్పట్లో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఇంగ్లీష్‌ మన్‌లో ఇదే చర్చనీయాంశమైంది. ఆనంద్‌ బజార్ పత్రిక మత సామరస్యానికి దోహదపడుతోంది. మన దేశంలో పేదరికం, మహిళల దుస్థితి వంటి అంశాలను ప్రస్తావించటంలో ఆనంద్‌బజార్ పాత్ర కీలకం. ఈ పత్రిక పుట్టి పాతికేళ్లైన సందర్భంగా అప్పట్లో సిల్వర్ జూబ్లీని ఘనంగా జరుపుకున్నారు. ఆ తర్వాత భారత స్వాతంత్య్ర వేడుకలను సంపాదకీయ పేజీలో ప్రచురించారు. ఆనంద్ బజార్ పత్రిక ఎదుగుదల కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించింది" అని వెల్లడించారు అమర్త్యసేన్. 


"పేపర్ సర్క్యులేషన్ పరంగా దేశంలోని 15 అతిపెద్ద వార్తాపత్రికలలో ఇది ఒకటి. అప్పటి చీఫ్ ఎడిటర్ అశోక్ కుమార్ సర్కార్ స్వర్ణోత్సవ ప్రసంగంలో, 'పత్రిక మరింత ఎదిగింది. ఇది ప్రజల కోసమే కానీ ప్రభుత్వాల కోసం కాదు అని అన్నారు. ఆ తర్వాత సంస్థ 75వ వార్షికోత్సవాలనూ ఘనంగా జరుపుకుంది. ఆ సమయానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. అప్పుడే ఏబీపీ..టెలివిజన్‌ రంగంలో అడుగు పెట్టింది. అప్పటి చీఫ్ ఎడిటర్ అవీక్ సర్కార్ ఇందుకు ఎంతో కృషి చేశారు. 25 సంవత్సరాలలో, ఏబీపీ గ్రూప్ మరింత విస్తృతమైంది. టెలివిజన్, డిజిటల్, ప్రింట్, రేడియోల ద్వారా జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి నెలా 30 కోట్ల మంది భారతీయులకు చేరువవుతోంది" అని అమర్త్యసేన్ ప్రశంసించారు. 


మీడియా రంగంలో కీలకమైన సంవత్సరం: చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ 
ఏబీపీ న్యూస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న అతిథులకు ఆనంద్ బజార్ పత్రిక చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ కృతజ్ఞతలు తెలిపారు. సంక్షోభ సమయంలో కూడా ఈ మైలురాయి అధిగమించటానికి ప్రజలే కారణమని అన్నారు. ‘ఇది మీడియా రంగంలో కీలకమైన సంవత్సరం. రీడర్స్ డైజెస్ట్, ఫారిన్ అఫైర్స్ మ్యాగజైన్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. టైమ్ మ్యాగజైన్ వందో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. బీబీసీ మొదటి రేడియో ప్రసారానికి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎలియట్స్ వెస్ట్‌ల్యాండ్, జాయిస్ యులిసెస్ ప్రచురించి ఒక శతాబ్దం పూర్తయిందని" చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ వెల్లడించారు. ఏబీపీ వందేళ్లు పూర్తి చేసుకోవటానికి సహకరించిన వారందరినీ హీరోలుగా అభివర్ణించారు.