YSRCP Perminent President Jagan :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ప్లీనరీలో ఎన్నుకోవడంపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆ నియామకం చెల్లుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నది చాలా మందిలో ఉన్న సందేహం. ఇదే విషయాన్ని పార్టీ వ్యవహారాలపై అధికారికంగా మాట్లాడే ప్రభుత్వ ముఖ్య సలహాదారు, వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆయన గడుసుగా సమాధానం ఇచ్చారు.   చంద్రబాబు లాగా ఎవరైనా గుంటనక్కలు ఉంటారేమోనని జగన్ని శాశ్వత అధ్యక్షుడిగా చేశామని చెప్పారు. 


వైఎస్ఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడు జగన్ - ప్లీనరీలో తీర్మానం ! రాజ్యాంగపరంగా సాధ్యమేనా ?


తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సంక్షోభం వచ్చినప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్‌ను దింపేసి తానే సీఎం అయ్యారు. ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీకి ఆయనే అధ్యక్షుడు అయ్యారు. అప్పట్నుంచి టీడీపీ ఆయన చేతుల్లోనే ఉంది. లక్ష్మి పార్వతి కారణంగా పార్టీ నాశనం అవుతూంటే కాపాడుకోవడానికి ఈ పని చేశామని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినా ప్రజల నుంచి మద్దతు లభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినా ప్రజల మద్దతు చంద్రబాబుకే లభించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ చంద్రబాబు విజయం సాధించారు. అయితే ఆ ఘటనలపై ఇప్పటికీ ఇతరపార్టీలు ఆయనను వెన్నుపోటు పేరుతో విమర్శలు చేస్తూనే ఉంటాయి. 


అయితే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వేరు.. అప్పట్లో టీడీపీ వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు ఉంది. ఆయనను మించిన ప్రజాకర్షణ ఉన్న నేత లేరు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా శాశ్వత అధ్యక్షుడిగా  నియమించారు.  పార్టీలో అంతర్గత సంక్షోభం భయంతోనే ఇలా చేశామని సజ్జల చెప్పడం కొత్త చర్చలకు కారణం అవుతోంది. 


పులివెందుల నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తారా ? ప్రచారంలో నిజం ఎంతంటే ?


సీఎం జగన్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి.అక్రమాస్తుల కేసులో విచారణలు ప్రారంభం కావాల్సి ఉంది. బెయిల్ రద్దు అయినా .. శిక్ష పడినాజైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా పార్టీపై పెత్తనం చేయకుండా ఇలా శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకున్నారని టీడీపీ నేతలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. సజ్జల వ్యాఖ్యలు చంద్రబాబును విమర్శిస్తూ చేసినట్లుగా ఉన్నా.. పార్టీలో  ఏదో సమస్య ఉందన్న అభిప్రాయం కలిగించేలా ఉన్నాయని భావిస్తున్నారు.