Assembly Seat For YS Sunita :    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి వైదొలిగి కుమార్తె  పెట్టుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నారు. మరో వైపు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తెకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చేందుకు వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షుడు జగన్ నిర్ణయించినట్లుగా కొన్ని మీడియాల్లో ప్రచారం జరుగుతోంది. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త మద్దతుగా ఉండేవే కావడంతో ఉద్దేశపూర్వకంగా వాటికి లీక్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. 


వైఎస్ఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడు జగన్ - ప్లీనరీలో తీర్మానం ! రాజ్యాంగపరంగా సాధ్యమేనా ?


వైఎస్ వినేకానందరెడ్డి గతంలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా.. కడప నుంచి ఎంపీగా గెలిచారు. మంత్రిగా చేశారు. వైఎస్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల సమయంలోనూ ఆయన ఎంపీగా పోటీ చేసేందు్కు సిద్ధపడ్డారన్న ప్రచారం జరిగింది. ఎక్కడో ఓ చోట పోటీ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే అనూహ్యంగా హత్యకు గురయ్యారు. మొదట ఆయనది గుండెపోటుగా ప్రచారం జరిగింది. చివరికి హత్యగా తేల్చారు. తన తండ్రి హత్య కేసు నిందితులెవరో తేల్చాలని వైఎస్ సునీత పోరాడుతున్నారు. కోర్టుకెళ్లి సీబీఐ విచారణకు కూడా ఆదేశాలు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సీబీఐ కేసు విచారణ నెమ్మదిగా సాగుతోంది. 


మేనిఫెస్టో అమలు చేశామని నమ్మకం కలిగితేనే ఆశీర్వదించండి - ప్రజలకు జగన్ పిలుపు !


తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే ఆమె తీవ్రంగా  శ్రమిస్తున్నారు. వైద్యురాలైన  వైఎస్ సునీత కానీ ఆమె భర్త కానీ తమకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నట్లుగా ఎప్పుడూ చెప్పలేదు. కానీ గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఆమెపై ఆరోపణలు  చేశారు. టీడీపీ టిక్కెట్‌పై కడప నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ సునీత ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి స్పందనలు వ్యక్తం చేయలేదు. 


జగన్ వచ్చే ఎన్నికల్లో జమ్మల మడుగుకు మారి పులివెందుల టిక్కెట్‌ను వైఎస్ సునీతకు ఇస్తారని సోషల్ మీడియాలో కొన్ని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ సునీత సన్నిహితులు మాత్రం .. తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నారు కానీ రాజకీయ ఆశలతో కాదని  అంటున్నారు. మొత్తానికి వైఎస్ కుటుంబ రాజకీయం కూడా కీలక స్థానానికి చేరినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.