AAP Vs BJP:
సంజయ్ సింగ్ విమర్శలు..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దర్యాప్తు సంస్థల్ని తమకు నచ్చినట్టుగా వాడుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండి పడుతున్నాయి. ముఖ్యంగా ఆప్ నేత సిసోడియాను అరెస్ట్ చేయడపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఆ పార్టీ. ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ప్రతిపక్షమే లేకుండా చేసి అప్పుడు మోదీ ప్రశాంతంగా నిద్రపోతారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా ఈ సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ నాదో సలహా అంటూ ట్వీట్ చేశారు.
"ప్రధాని మోదీకి నాదో సలహా. ప్రతిపక్షాలపై ఈ దాడులు చేసి అసలు అపోజిషన్ అనేదే లేకుండా చూసుకోండి. ఆ తరవాత 8 గంటల పాటు నిద్రించండి. అప్పుడు ప్రతిపక్షమూ ఉండదు. దేశంలో ప్రజాస్వామ్యమూ ఉండదు. కేవలం నియంతృత్వం ఒకటే మిగులుతుంది"
- సంజయ్ సింగ్, ఆప్ ఎంపీ
ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మనీశ్ సిసోడియా దర్యాప్తు సంస్థలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. తనను జైల్లో ఉంచినంత మాత్రాన ఆత్మస్థైర్యం కోల్పోను అని తేల్చి చెప్పారు.
"మీరు నన్ను జైల్లో పెట్టి వేధించొచ్చు. కానీ నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఏమీ చేయలేరు. స్వాతంత్ర్య సమర యోధులనూ బ్రిటిషర్లు ఇలాగే వేధించారు. కానీ వాళ్ల సంకల్పం చెదరలేదు"
-మనీశ్ సిసోడియా