Gold Seized In Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టుబడింది. 4.21 కోట్లు విలువ చేసే 7.396 కిలోల బంగారం పట్టుబడింది. అయితే చెన్నయ్ మెయిల్ రైళ్లో కోల్ కతా నుంచి ట్రాలీ బ్యాగ్ తో ఓ వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు మరో వ్యక్తికి తన బ్యాగ్ ను అందజేస్తుండగా.. డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట చేశారు. అనంతరం ట్రాలీ బ్యాగును తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే 4.21 కోట్ల రూపాయల విలువ చేసే 7.396 కిలోల బంగారపు కడ్డిలను గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి స్మగ్లింగ్ చేసి కోల్ కతా లో కడ్డీలుగా మార్చి ఏపీకి తీసుకొచ్చినట్డు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను  విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.  


ఐదు రోజుల క్రితం విశాఖకు తరలింపు


బంగ్లాదేశ్ నుంచి విశాఖకు అక్రమంగా తరలిస్తున్న 1.86 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.1.07 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. బంగారం స్మగ్లింగ్ పై సమాచారంతో  డీఆర్ఎస్ అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో కోల్‌కతా నుంచి షాలిమార్-సికింద్రాబాద్ AC సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.12773)లో వచ్చిన స్మగ్లర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. నిందితుల నుంచి రూ.1.07 కోట్ల విలువైన 1860.5 గ్రాముల బంగారాన్ని (కడ్డీలు, ముక్కల రూపంలో) స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి నుంచి రాబట్టిన సమాచారంతో సోదాలు చేశారు.  ఈ స్మగ్లింగ్ బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి తరలించినట్లు డీఆర్ఐ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు స్మగ్లింగ్ చేసి అక్కడ బంగారం కరిగించి, వివిధ ఆకారాలు, పరిమాణాల్లో బంగారు కడ్డీలు/ముక్కలుగా మార్చారు. కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను  విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.


అక్రమ ఆయుధాల కేసు 


అనంతపురం అక్రమ ఆయుధాల కేసులో  పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప మీడియాకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన ఆరుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించారు. వారం రోజులు పాటు నిందితుల విచారణ సాగింది. నిందితుల ఇచ్చిన సమాచారంతో మధ్యప్రదేశ్ లో పోలీసులు దాడులు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 9 అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలపై అనంతపురం పోలీసుల దాడులు చేశారు. ఈ తయారీ కేంద్రాల్లో 4 పిస్తోల్స్, 2 తూటాలు, 2 కేజీల గంజాయి స్వాధీనం  చేసుకున్నారు.  కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసు విచారణకు  కేంద్ర దర్యాప్తు సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 22 తుపాకులు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసులో పురోగతి సాధించిన జిల్లా పోలీసులను డీజీపీ అభినందించారని, రూ.25 వేల రివార్డ్ ప్రకటించారన్నారు.