Somu Veerraju Meets Mohanbabu :   ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మూడు మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సినీ నటుడు మోహన్ బాబును కోరారు. ఆయన ఇవాళ తరుపతిలో ఉన్న ఎంబీ యూనివర్శిటీ ప్రాంగణంలోని మోహన్ బాబు నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించాలని కోరారు. అయితే ఈ అంశంపై మోహన్ బాబు అంగీకరించారో లేదో స్పష్టత లేదు. వీరిద్దరి మధ్య ఏపీ రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. 


వైసీపీలో చేరినా ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని మోహన్ బాబు


మోహన్ బాబు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఆ పార్టీ కోసం ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ కార్యాకలాపాల్లో కనిపించలేదు. వైసీపీ కోసం పని చేసిన ఇతర సినీ నటులకు కూడా పదవులు లభించాయి కానీ మోహన్ బాబుకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీపై అసంతృప్తితో దూరం జరిగారని భావిస్తున్నారు. కొన్నాళ్ల కిందట చంద్రబాబును కూడా కలిశారు. ఆ విషయం హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత కొన్ని ఇంటర్యూల్లో మాట్లాడిన ఆయన తాను ఏ పార్టీలో లేనని ప్రకటించారు. అయితే బీజేపీలో చేరుతాను కానీ ఇక ఏ పార్టీ తరపున పని చేసేది లేదని చెప్పారు. అంటే తాను వైఎస్ఆర్‌సీపీకి దూరంగా ఉన్నట్లుగా వివరించినట్లయింది. 


మోదీకి ఆత్మీయుడినని బీజేపీ మనిషినని గతంలో ప్రకటించుకున్న మోహన్ బాబు                     


మోహన్ బాబు.. తాను ప్రధానమంత్రి మోదీకి ఆత్మీయుడినని చెబుతూ ఉంటారు. మోదీ తనను బీజేపీకి ఆహ్వానించారని కూడా ప్రకటించారు. అయితే బీజేపీలో చేరుతారా లేదా అన్న అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గత ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు తిరుపతిలో రోడ్ల మీద విద్యార్థులతో కలిసి ధర్నా చేసినందుకు ఆయనపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఆ కేసు విచారణకు తిరుపతిలో హాజరైనప్పుడు తాను బీజేపీ మనిషినని ప్రకటించుకున్నారు. అందుకే ఇప్పుడు సోము వీర్రాజు.. తమకు మద్దతివ్వాలని మోహన్ బాబును నేరుగా అడిగినట్లుగా చెబుతున్నారు. 


మహోన్  బాబు మద్దతు ప్రకటిస్తారా ?                    


మోహన్ బాబు రాజకీయ ప్రకటనలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. గ్రాడ్యూయేట్లు మోదీ పాలనపై ఎంతో నమ్మకంతో ఉన్నారని గెలిపిస్తారని అనుకుంటున్నారు. అందుకే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి విస్తృతంగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల మద్దతు కూడా లభిస్తే విజయం సులువు అవుతుందన్న ఉద్దేశంతో సోము వీర్రాజు బీజేపీ సానుభూతి పరుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.