బార్‌లో మద్యం తాగి పూర్తిగా గేటు దాటకుండానే కింద పడిపోతే మన దగ్గర ఏం చేస్తారు..?. సింపుల్‌గా తీసుకెళ్లి బయట పడేస్తారు. అదే బార్ ఆవరణలో పార్కింగ్ దగ్గర వేరే వాళ్లతో గొడవపడితే ఏం చేస్తారు..?. ఇంకా నాలుగు తగిలించి బయట పడేస్తారు. ఇలా చేశారని ఆ తాగుబోతు ఎవరికైనా చెబితే బార్ ఓనర్లను ఏమీ అనరు సరి కదా ..ఎదురు చీవాట్లు పెడతారు. అది ఇక్కడ కానీ అమెరికాలో మాత్రం అలాంటి సిట్యూయేషన్లు ఎదురైతే కోట్లలో నష్టపరిహారం పొందొచ్చు. అలా పొంది చూపించాడు డానియల్ రాల్స్ అనే అమెరికాలోని టెక్సాస్ కుర్రాడు.
డానియల్ రాల్స్‌కు ఓ సారి బీర్ తాగాలని అనిపించింది. కారు తీసుకుని కాస్త ప్రశాంతంగా ఉందని మెక్సికల్ గ్రిల్ పబ్ అనే రెస్టారెంట్‌కు వెళ్లాడు. తను తాగాలనుకున్నంత తాగాడు. బిల్లు కట్టి ఇంటికి బయలుదేరాడు. అయితే కారు తీద్దామనుకునేలోపు ఇంకో మందు బాబు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. మాటకు మాట పెరిగి ఇద్దరు తన్నుకునే వరకూ సిట్యూయేషన్ వచ్చింది. తన్నుకున్నారు కూడా. ఈ గొడవలోడానియల్ రాల్స్‌కు గాయం అయింది. తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. కానీ తనను మరో మందు బాబు కొడుతూంటే బార్ యజమాని కానీ.. బార్ టెండర్ కానీ రాలేదని .. ఖచ్చితంగా తప్పు వాళ్లదేనని కోర్టుకెళ్లారు.
మెక్సికల్ గ్రిల్ రెస్టారెంట వల్లే తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని కోర్టులో వాదించాడు. బార్ వాళ్లే తనకు ఫుల్‌గా తాగించారని, ఇలాంటి నేరాలు జరిగే అవకాశ ఉందని తెలిసి మరీ తనకు మందు టూమచ్‌గా సర్వ్ చేశారని, పైగా ఘర్షణ టైంలోనూ బార్ నిర్వాహకులు వచ్చి చూడలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. గొడవ ఆపకపోగా... గాయపడ్డాక కనీసం ఆంబులెన్స్‌ను కూడా పిలవలేదని తనకు నష్టపరిహారం ఇప్పించాల్సిందేనని వాదించాడు. దీనిపై రెండేళ్ల పాటు వాదనలు సాగాయి. చివరికి దాదాపు 40 కోట్ల రూపాయల నష్టపరిహారం రాబట్టుకున్నాడు.
నిజానికి డానియల్ రాల్స్ పచ్చి తాగుబోతు. పలు మార్లు తాగి న్యూసెన్స్ చేసిన కేసుల్లో జైలుకెళ్లాడు. రాల్స్ అలా తాగడానికి తమకూ సంబంధం లేదని అదే పనిగా చెప్పినా కోర్టు వారి మొర ఆలకించలేదు. పైగా కోర్టు నోటీసులకు కూడా స్పందించకపోవడంతో మరింత పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో రాల్స్ పంట పండినట్లయింది. ఇంకేం పని చేయకుండా మరింత కాలం బార్లతో తాగడానికి అవసరమైన డబ్బు అంతా వచ్చి పడింది. అవి అయేటప్పుటికి మరో బార్‌పై కేసు వేసే పనిలో ఉంటాడేమో కానీ ఇప్పటికైతే సరిపెట్టుకుంటున్నాడు.