Elope With Mother In Law:  ప్రేమ ఎప్పుడు, ఎవరితో పుడుతుందో తెలియదు. వన్ వే లవ్ అయితే దానికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. ఇద్దరికీ ఒకే సారి పుట్టిందంటే ఆ ప్రేమకు చూపు ఉండదు. సమాజం గురించి పట్టించుకోదు. వావి వరసలు లాంటివి కూడా చూసుకోదు. దానికి ఈ ప్రేమ జంటే సాక్ష్యం.               

ఉత్తరప్రదేశ్ లోని అలీ ఘడ్‌లో  ఓ మహిళతో మరో యువకుడు పారిపోయాడు. ఇద్దరం ప్రేమించుకున్నామని కానీ.. సమాజం అంగీకరించదని అందుకే అందరికీ దూరంగా వెళ్తున్నామని చెప్పి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్న డబ్బు, దస్కం తీసుకెళ్లిపోయారు.           

ఎన్నో ప్రేమలను సమాజం అంగీకరించింది.. వీరి ప్రేమను ఎందుకు అంగీకరించదని చాలా మంది అనుకుంటారు.. కానీ మీరు కూడా అంగీకరించరు. ఎందుకంటే ఆ మహిళ ...  ఆ యువకుడికి కాబోయే అత్తగారు. అంటే ఆమె కూతుర్నే  ఆ వ్యక్తి పెళ్లి చేసుకోవాల్సి ఉంది. 

అలీఘఢ్‌లో ఓ కుటుంబం తమ కుమార్తెకు పెళ్లి సంబంధం చూసింది. వీలైనంతలో ఘనంగా పెళ్లి చేయాలనుకుంది. ఆ పెళ్లి కుర్రాడు కూడా అమ్మాయి నచ్చిందని.. పెళ్లి పనుల్లో కూడా సాయం చేయడానికి వస్తున్నాడు. ఇలా అత్తతో కలిసి ఎక్కువగా పనులు చేశాడు. ఈ క్రమంలో అసలు ఆమె కూతురు కన్నా..తన సోల్ మేట్‌ను ఆమె తల్లిలోనే చూసుకున్నాడు. ప్రేమించేశాడు. ఆమె కూడా అలాగే అనుకుంది. తన కూతుర్ని చేసుకోబేయేవాడు..నిజంగా తన కూతురు కోసం  కాదని తన కోసం పుట్టాడని అనుకుంది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడయింది.                

ఇద్దరు మనసులు కలిశాక ఇక ఎవరితో పని లేదని డిసైడయ్యారు. వెంటనే వారు..తమ కార్యాచరణ  ప్రణాళిక రెడీ చేసుకున్నారు. పెళ్లి దగ్గర పడుతూంటే వారు టెన్షన్ పడ్డారు. చివరికి పెళ్లికి వారం రోజుల ముందుగా ముహుర్తం పెట్టుకుని ఎగిరిపోయారు. వెళ్లేటప్పుడు పెళ్లి కోసం రెడీ చేసుకున్న నగలు కూడా తీసుకెళ్లిపోవడంతో  కూతురు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.            

అలీఘఢ్‌లోని మడ్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 16న ఆ యువతి వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి ముందు 3 లక్షల రూపాయలు మరియు 5 లక్షల విలువైన నగలు తీసుకొని ఆ మహిళ పారిపోయింది. తన కూతురి ఆశలను నాశనం చేసి ఆమె తన అల్లుడితో పారిపోయింది.      

వాళ్లు పోతే పోయారని.. నగలు మాత్రం.. కనిపెట్టి ఇవ్వాలని వధువు కుటుంబం పోలీసుల్ని కోరుతోంది. అమ్మాయి పెళ్లి కోసం ఎంతో కష్టపడి వాటిని సమకూర్చుకున్నామని ఇప్పుడు కన్న తల్లే అలా చేయడం వల్ల..  కన్న కూతురి పెళ్లిని, జీవితాన్ని కూడా నాశనం చేసిందని బాధపడుతున్నారు.