Indian Navy Officials:


8 మందికి ఉరిశిక్ష 


ఖతార్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ నేవీకి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. అయితే..ఈ తీర్పుని సవాలు చేస్తామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ అధికారుల్లో ఒకప్పుడు యుద్ధనౌకల్లో మేజర్ స్థాయి వ్యక్తులూ ఉన్నారు. దాదాపు ఏడాదిగా వీళ్లు ఖతార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ తీర్పుపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లీగల్‌ పరంగా తీసుకోవాల్సిన చర్యల్ని కచ్చితంగా తీసుకుంటామని హామీ ఇచ్చింది. 


"నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష వేయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ కేసుకి సంబంధించిన పూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్ల కుటుంబ సభ్యులతో మేం ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. లీగల్‌ టీమ్‌తోనూ చర్చలు జరుపుతున్నాం. ఈ తీర్పుని సవాల్ చేసేందుకు న్యాయ పరంగా అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాం"


- భారత విదేశాంగ శాఖ  






ఇప్పటికే చాలా సార్లు బెయిల్‌ పిటిషన్‌ వేశారు అధికారులు. కానీ వాటిని ఖతార్ అధికారులు కొట్టేశారు. పైగా జైలుశిక్షను పొడిగిస్తూ వచ్చారు. చివరకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పుని వెలువరించింది. 2022 ఆగస్టులో 8 మంది భారత నేవీ మాజీ అధికారుల్ని అరెస్ట్ చేశారు ఖతార్ పోలీసులు. ఇజ్రాయేల్‌కి గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో అదుపులోకి తీసుకుంది. అక్కడి ఓ కంపెనీలో పని చేస్తూనే ఇలా గూఢచర్యం చేస్తున్నారని ఆరోపించింది. అప్పటి నుంచి జైలు శిక్షఅనుభవిస్తున్నారు అధికారులు.


ఇటీవల డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తికి సింగపూర్ ప్రభుత్వం ఉరి శిక్ష విధించడం సంచలనమైంది. భారత్ మూలాలాన్న తంగరాజు సుప్పియ (46) డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతడి నుంచి దాదాపు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్‌లోని చంగీ జైల్లో పెట్టిన అధికారులు...ఆ తరవాత ఉరి తీశారు. ఈ మేరకు సింగపూర్ ప్రిజన్ సర్వీస్‌ అధికారిక ప్రకటన చేసింది. అతడిని క్షమించి వదిలేయాని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. నిందితుడు తంగరాజు కోర్టులో రివ్యూ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ దాన్ని కొట్టేశారు. రివ్యూ చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలను తంగరాజు కోర్టుకి ఇవ్వలేకపోయాడని, అందుకే తప్పని పరిస్థితుల్లో ఉరి శిక్ష విధించాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు అధికారులు. ఈ విషయంలో ఎలాంటి పక్షపాతమూ లేదని స్పష్టం చేశారు. సింగపూర్‌లో యాంటీ డ్రగ్స్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమాజాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి శిక్షలు పడాల్సిందేనని తేల్చి చెబుతోంది.


Also Read: ఎన్నికల ముందు రాజస్థాన్‌ సర్కార్‌కి షాక్, అశోక్ గహ్లోట్‌ కొడుకు వైభవ్‌కి ఈడీ సమన్లు