"మాకేం తక్కువ.. పేరుకే దివ్యాంగులం.. పట్టుదలలో మీకన్నా గొప్పవాళ్లం" ఈ మాటలను మరోసారి రుజువు చేశారు ఆ దివ్యాంగులు. 8 మంది బృందంగా ఏర్పడి ఏకంగా సియాచిన్ పర్వతాన్ని అధిరోహించారు. మంచుకొండల్లో వారు చూపిన మనోధైర్యానికి ఆ శిఖరమే దాసోహమైంది. ప్రపంచ రికార్డ్ వారి సొంతమైంది.


ఐదు రోజుల్లో..


భారత ఆర్మీ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ క్యాంపెయిన్ లో భాగంగా దివ్యాంగులు ఈ సాహసం చేశారు. ఆదివారం సియాచిన్ హిమానీనదంలో ఉన్న 15,632 అడుగుల ఎత్తైన కుమార్ పోస్ట్​కు ఎనిమిది మంది దివ్యాంగులు చేరుకున్నారు. 60 కిలోమీటర్లను ఐదు రోజుల్లో వీరు అధిరోహించారు. చల్లటి గాలులు, ఊపిరి కూడా అందని వాతావరణంలో వీరు చూపిన తెగువకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 






ఈ దివ్యాంగుల బృందానికి ఆర్మీకి చెందిన ప్రత్యేక దళాలు శిక్షణనిచ్చాయి. సెప్టెంబర్ 7న మొదలైన వీరి జైత్రయాత్ర సెప్టెంబర్ 11న ముగిసింది. వీరు చేసిన ఈ సాహసయాత్ర ప్రపంచ రికార్డులకెక్కింది.


ప్రతికూలతలు దాటి..


రోజుకు 15 కిమీ చొప్పున వీరు నడిచారు. యాత్ర సమయంలో చల్లగాలులు, మంచుగడ్డల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. కాన ఎక్కడా పట్టు వదలకుండా లక్ష్యాన్ని సాధించారని కొనియాడారు. వీరు సాధించిన విజయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 






Also Read: Delhi Building Collapse: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. సహాయక చర్యలు ముమ్మరం