Buses Fell into River in Nepal: నేపాల్‌లో ఘోర ప్రమాదం (Nepal Bus Accident) జరిగింది. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో రెండు బస్‌లు నదిలో పడిపోయాయి. దాదాపు 60 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వీళ్లలో ఆరుగురు భారతీయులున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్‌లలో కలిపి 65 మంది ప్రయాణికులున్నారు. త్రిశూలి నదిలో ఈ రెండు బస్‌లు పడిపోయాయి. ఖాట్మండుకి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఓ బస్‌లో 24 మంది ప్రయాణికులు ఉండగా, మరో బస్‌లో 41 మంది ఉన్నారు. కొద్ది రోజులుగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు చోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయి. బస్‌లు వెళ్లే సమయంలో కొండ చరియలు పడడం వల్ల ఒక్కసారిగా నదిలో పడిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నాయి. అయితే ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌ సవాల్‌గా మారింది.






ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గల్లంతైన వాళ్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు X వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. నేపాల్ ఆర్మీ బాధితుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేసింది. 


"ఈ ఘటన నన్నెంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. 60 మందికి పైగా ప్రయాణికులు నదిలో గల్లంతవడం చాలా బాధాకరం. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని శాఖల అధికారులు సహాయం అందించాలి. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టాలని ఆదేశిస్తున్నాను"


- పుష్పకమల్ దహాల్ ప్రచండ, నేపాల్ ప్రధానమంత్రి






ఈ వర్షాల కారణంగా పలు ఫ్లైట్స్‌నీ రద్దు చేశారు. ఇప్పటి వరకూ నేపాల్‌లో వర్షాలు, వరదల వల్ల 62 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 90 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లోనే 28 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతై ఇంకా కనిపించలేదు. 


Also Read: Viral Video: పుణే ట్రైనీ IAS ఆఫీసర్ తల్లి హల్‌చల్‌, రైతుల భూములు కబ్జా - అడ్డుకున్న వాళ్లకి గన్‌తో వార్నింగ్‌