Temple Wall Collapses: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఆలయం గోడ కుప్ప కూలి 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. శిథిలాల కింద కొంత మంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాగర్ జిల్లాలోని ఆలయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. షాపూర్‌లోని హర్దౌల్ బాబా టెంపుల్‌లో ఓ కార్యక్రమం జరుగుతుండగా ఉన్నట్టుండి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు హాస్పిటల్‌కి తరలించారు. పోలీసులతో పాటు స్థానికులూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.





భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన పిల్లలంతా 10-15 ఏళ్లలోపు వాళ్లేనని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు వివరించారు. (Also Read: Kerala: వయనాడ్ విలయంపై శశి థరూర్ పోస్ట్‌, క్షణాల్లోనే కాంట్రవర్సీ - క్లారిటీ ఇచ్చినా ఆగని ట్రోలింగ్)


"ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లకి చికిత్స అందిస్తున్నాం"


- దీపక్ ఆర్య, కలెక్టర్ 






సీఎం దిగ్భ్రాంతి


ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పరిహారం కింద రూ.4 లక్షల అందిస్తామని ప్రకటించారు. అంతకు ముందు రేవా జిల్లాలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. గోడ కూలిన ఘటనలో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. అంతా 5-7 ఏళ్లలోపు వాళ్లే. స్కూల్ నుంచి వస్తుండగా ఓ ఇంటి గోడ కూలి వాళ్ల మీద పడింది. అంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు. 


Also Read: Kerala Landslide Fall: కమ్ముకున్న మరణ మేఘాలు! వయనాడ్‌లో ఊహించని ఆ రాత్రి అసలేం జరిగింది?